Breaking News

నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు చార్జ్‌ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా చార్జ్‌ తీసుకుంటూ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం కమిషనర్‌, సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బందితో పరిచయం తర్వాత కొనసాగుతున్న పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభమైనందున పారిశుద్ధ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, చెత్తను తొలగించాలని, వర్షపు నీరు సులభంగా వెళ్లిపోయేలా మోరీలు శుభ్రం చేయాలని ఆదేశించారు.

ప్రజల ఆవాసాల వద్ద ఎక్కడ కూడా నీరు ఆగకుండా సులభంగా వెళ్లి పోయే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల ప్రారంభంతో ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకుంటూ రెగ్యులర్‌గా పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలకు, నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దడానికి అందుబాటులో ఉన్న వాహనాలను ఉపయోగించాలని ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. భవనాల నిర్మాణాలకు అనుమతులు జారీ చేసేముందు నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

జల శక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో వర్షపు నీటిని వధా పోనీయకుండా వాటిని ఒడిసిపట్టటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, వందరోజుల ప్రణాళికతో వాటర్‌ బాడీని ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు సంబంధించిన అందుబాటులో ఉన్న వివరాలతో పాటు కొత్తగా చేపట్టే కార్యక్రమాలపై ఫోటోలతో కూడిన డాక్యుమెంటేషన్‌ తయారు చేయాలన్నారు. హరితహారంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటడం వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం వార్డుల పునర్విభజనను జనాభాకు అనుగుణంగా సిద్ధం చేయాలని, ఈనెల ఐదవ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ టైం బౌండు ప్రకారము చర్యలు చేపట్టాలని సూచించారు. నగర ప్రజలు తమ గహాల వద్దకు వచ్చే మున్సిపల్‌ సిబ్బందికి తడి – పొడి చెత్తను వేయాలని బయట చెత్తను పార వేయవద్దని కోరారు. ప్లాస్టిక్‌ వల్ల పలు అనర్థాలు ఏర్పడుతున్నందున ప్లాస్టిక్‌ను తగ్గించడానికి ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. అంతకుముందు కలెక్టర్‌కు కమిషనర్‌ జాన్‌ సాంసన్‌, సిబ్బంది పుష్ప గుచ్చం అందించి ఆహ్వానించారు. కార్యక్రమంలో మేనేజర్‌ దేవేందర్‌, డిప్యూటీ చీఫ్‌ ప్లానర్‌ జలంధర్‌ రెడ్డి, డిఈ రషీద్‌, ఇంచార్జి ఎంహెచ్‌ఓ సాజిద్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *