Breaking News

మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోండి

నిజామాబాద్‌, జూలై 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్వరలో నిర్వహించబోయే మున్సిపల్‌ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైదరాబాద్‌ నుండి జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో మాట్లాడారు. ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవడం వార్డులో పునర్విభజన అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం వాటి ఫైనల్‌ పబ్లికేషన్‌ చేయాలన్నారు.

పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి వాటి పరిస్థితిని పరిశీలించాలని, మున్సిపల్‌ కమిషనర్‌ పోలింగ్‌ కేంద్రాలలో వసతులను తనిఖీ చేసి అవసరమైన ఏర్పాటు చేయాలన్నారు. నోటిఫికేషన్‌ అనంతరం సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు కూడా పోలింగ్‌ స్టేషన్లను పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంసిద్ధతకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారుల నియామకం పోలింగ్‌ కేంద్రాల ప్రచురణ, ఓటర్ల జాబితా ఫైనల్‌ చేసుకోవడం, బ్యాలెట్‌ పేపర్లు బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేసుకోవడం చేయాలన్నారు. బ్యాలెట్‌ పేపర్లు ముద్రణకు ప్రింటింగ్‌ ప్రెస్‌లను ముందే ఎంపిక చేసుకోవాలని తెలిపారు.

నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగానే పోటీలో ఉన్న అభ్యర్థులకనుగుణంగా బ్యాలట్‌ పేపర్లను ముద్రించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా స్థానికంగా పోలింగ్‌ మెటీరియల్‌ సమకూర్చుకోవాలని, రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, పోటీ చేసే అభ్యర్థుల హ్యాండ్‌ బుక్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని అవసరం మేరకు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పోలింగ్‌ సిబ్బంది జాబితా సేకరించి మొదటి ర్యాండమైజేషన్‌ పూర్తి చేయాలని అని తెలిపారు. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ సెంటర్‌, కౌంటింగ్‌ సెంటర్లను గుర్తించి అక్కడ అవసరమైన సదుపాయాలను సరిచూసుకోవాలని ఆదేశించారు.

నోటిఫికేషన్‌ జారీ అయిన తర్వాత ప్రవర్తనా నియమావళి అమలు చేయుటకు టీంలను నియమించుకోవాలని తెలిపారు. వీసీలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, మున్సిపల్‌ కమిషనర్లు జాన్‌ సాంసన్‌, శైలజ, స్వామి, మున్సిపల్‌ శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ మహేందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆకస్మిక తనిఖీలు

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్‌ గ్రామాన్ని ...

Comment on the article