Breaking News

ముందు జాగ్రత్తలతోనే పంటల నష్ట నివారణ

నిజామాబాద్‌, జూలై 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవగాహన, ముందు జాగ్రత్తల చర్యలతోనే పంట నష్టాన్ని నివారించడానికి వీలవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు వ్యవసాయ అధికారులకు సూచించారు. మంగళవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మొక్కజొన్నలో కత్తెర పురుగు, పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ పై వ్యవసాయ అధికారులకు, ఏఈవోలకు, ఉద్యానవన అధికారులకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ, గత సంవత్సరం ముందస్తుగా చర్యలు చేపట్టడంతో పాటు రైతులకు అవగాహన కల్పించడం, వారు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించడం ద్వారా ఇతర జిల్లాల కంటే మన జిల్లాలో పత్తి పంటకు నష్టం జరగలేదన్నారు.

ఏ కార్యక్రమంపైన అయినా ముందస్తుగా చర్యలు తీసుకోవడం వల్లనే నష్టాలను నివారించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కేవలం అవగాహన కల్పించడమే కాకుండా రైతులు అధికారుల సూచనలు పాటించేలా చూడడం ముఖ్యమన్నారు. ఈ సంవత్సరం కూడా కత్తెర పురుగు, కాయతొలుచు పురుగులు పంటలకు నష్టం జరగకుండా రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేసి పంటలకు చీడపీడల వల్ల నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో జిల్లాలోని 22 మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైనందున పంటలపై రైతులకు సరైన సూచనలు చేయాలన్నారు. ఏ పంటలు వేసుకుంటే ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయో వారికి వివరంగా తెలియజేయాలన్నారు.

రైతు సమగ్ర సర్వే సమాచార సేకరణ పూర్తయినందున వీలైనంత త్వరగా ఆ వివరాలను అప్‌లోడ్‌ చేయాలని, ఈ విషయమై రాష్ట్రస్థాయి అధికారులు ప్రతిరోజు సమీక్షిస్తున్నారని, అధికారులు ఈ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సాగుచేస్తున్న పంటలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు నాణ్యతా ప్రమాణాలు ఉండేవిధంగా రైతులకు అందుబాటులో ఉంచాలని వాటి కొరత లేకుండా చూడాలన్నారు. లైసెన్సు లేకుండా ఎరువులు, విత్తనాలు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ దిశగా అధికారులు తనిఖీలు చేసి అటువంటి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జలశక్తి యోజన అభియాన్‌ క్రింద కేంద్ర సీనియర్‌ అధికారుల బందం జిల్లాలో సోమవారం నుండి పర్యటిస్తున్నాయని నీటిని సంరక్షించడం, వర్షపునీటిని వధా కాకుండా చూడడం అందుబాటులో ఉన్న నీటిని వీలైనంతవరకు ఎక్కువ పంటలకు ఉపయోగించడం తదితర కార్యక్రమాలతో వందరోజుల షెడ్యూల్‌ ఖరారు చేశారని ఈ కార్యక్రమం ఈ నెల నుండి ప్రారంభం అయిందని తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతులకు నీటిని సద్వినియోగం చేసుకోవడం, తక్కువ నీటితో ఎక్కువ పంటలను సాగు చేయడంపై అవగాహన కల్పించడం, తదితర కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

తెలంగాణకు హరితహారంలో ఈ సంవత్సరం లక్ష్యాన్ని ఎక్కువగా నిర్దేశించిన వ్యవసాయ శాఖ తమకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తమ విధులతోపాటు వ్యక్తిగతంగా కూడా మొక్కలను నాటించడానికి, నాటడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పంటలను పురుగుల నుండి కాపాడడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ వెంకటయ్య, నిర్వాహక సమన్వయకర్త డాక్టర్‌ నవీన్‌, ఉద్యానవన శాఖ ఉపసంచాలకులు నరసింహదాస్‌, ఏడిఏలు, ఏఇఓలు, ఏవోలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *