Breaking News

జలసంపద కాపాడుకోవాలి

నిజామాబాద్‌, జూలై 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవిష్యత్‌ తరాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పటినుండి జల సంపదను కాపాడుకోవాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. కషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్‌ జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్మూర్‌ పట్టణంలో మంగళవారం క్షత్రియ కళాక్షేత్రంలో రైతులు రైతు సమన్వయ సమితి సభ్యులు ప్రజా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన జలశక్తి అభియాన్‌ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు.

నిజామాబాద్‌ జిల్లాలో ఆర్మూర్‌, నిజామాబాద్‌, మోర్తాడ్‌, ముప్కాల్‌ మండలాల్లో పడిన వర్షం నీటి కంటే ఎక్కువగా నీటి వినియోగం ఎక్కువై భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, ఆర్మూర్‌ ప్రాంతంలో 16 గ్రామాలలో 12 గ్రామాలలో పడిన వర్షపు నీటి సామర్థ్యం కంటే ఎక్కువగా వినియోగించుకున్నారని మరో 4 గ్రామాలు సమస్యాత్మకంగా ఉన్నాయని వాటిని తగ్గించడానికి ప్రతి వర్షపు నీటిబొట్టు భూమిలోకి వెళ్లే విధంగా నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

కార్యక్రమంలో ప్రధానంగా ఐదు అంశాలను దష్టిలో పెట్టుకొని ముందుకు పోతున్నట్లు చెప్పారు. వర్షపు నీటిని పట్టుకొని భూమిలోకి ఇంకింప చేయడం, చెరువులు, కాలువలు వనరులను పునరుద్ధరణ మరమ్మతులు చేపట్టి నీటి నిల్వను పెంపొందించడం, బోరుబావులను పున ప్రారంభం, వాటర్‌ షెడ్‌ మేనేజ్‌మెంట్‌, విరివిగా చెట్లు నాటడం చేయనున్నట్లు చెప్పారు. ఈ అంశాలలో తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, తెలంగాణ హరితహారం ద్వారా చెట్లు నాటడం అదేవిధంగా ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు, పాం ఫండ్స్‌ చేపట్టడం జరిగిందని చెప్పారు.

జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని 256 జిల్లాలో జూలై 1 నుండి ప్రారంభించారని అప్పటినుండి వంద రోజులు పూర్తి చేసేందుకు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో సాగునీరు, తాగునీరు ఇబ్బందులు ఎదురుకాకుండా వర్షపు నీటిని చక్కగా వినియోగించుకొని భూగర్భ జలాలు పెంపొందించే చర్యల్లో భాగంగా వనరులను ఉపయోగించుకుని ముందుకు పోవాలని, ఈ యజ్ఞం అధికార యంత్రాంగంతోనే కాదని ప్రజలు, రైతులు, ప్రజా ప్రతినిధులు అందరి సమిష్టి కషి ఉంటేనే విజయం సాధిస్తామన్నారు. అందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములేనని, జల సంరక్షణకు తోడ్పాటు అందించాలని కోరారు.

జిల్లాలో ఇరవై ఒక్క మండలాల్లో తక్కువ వర్షపాతం పడిందని కేవలం ఎనిమిది మండలాల్లో కొంచెం తగినంత వర్షపాతం నమోదైందని తక్కువ కురిసిన 21 మండలాల్లో ఈ ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. తక్కువ నీటితో ఎక్కువగా పంటలు పండించేందుకు మెట్ట భూములు ఆరుతడి పంటలు వేసుకోవాలని పంటల మార్పిడి చేపట్టాలని చెప్పారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు సూచనలు పాటించి పంటలు పండించాలని జిల్లా కలెక్టర్‌ కోరారు. కషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డాక్టర్‌ రవి బాలాజీ నాయక్‌ మాట్లాడుతూ నీటి సంరక్షణకు పలు అంశాలను రైతులకు వివరించారు.

సమావేశంలో జె.డి ఏ గోవిందు, డిఆర్‌డివో రమేష్‌, భూగర్భ జల శాఖ డిడి ఆర్‌డి ప్రసాద్‌, ఉద్యానవన శాఖ డిడి నర్సింగ్‌ దాస్‌, ఆర్‌డిఓ శ్రీనివాస్‌, జడ్పిటిసి సంతోష్‌, ఎంపీపీ నరసయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు మోహన్‌ రెడ్డి, ఆత్మ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, డాట్‌ కోఆర్డినేటర్‌ నవీన్‌ కుమార్‌, ఎంపీడీవో గోపి బాబు, తహసిల్దార్‌ రాణా ప్రతాప్‌ సింగ్‌, ఏడిఏ హరికష్ణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సెయింట్‌ థెరిసా హై స్కూల్‌ సీజ్‌ చేశారు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ ప్రాంతంలోగల సెయింట్‌ థెరిసా ...

Comment on the article