Breaking News

జాక్రాన్‌పల్లి వాసికి దుబాయ్‌ లాటరీ

రూ. 29 కోట్లతో కోటీశ్వరుడిగా విలాస్‌ రిక్కల్‌

నిజామాబాద్‌, ఆగష్టు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పని కోసం నానా అవస్థలు పడ్డాడు… భార్యా, ఇద్దరు కూతుళ్ళతో కుటుంబ జీవనం భారంగా మారింది… పొట్ట చేత పట్టుకొని కానరాని దేశాల వెంట పని కోసం పరుగులెత్తాడు…. ఫలితం శూన్యం… నిరాశ, నిస్పృహతో స్వదేశం వచ్చాడు… లక్ష్మిదేవి అనుగ్రహించింది… ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు… వివరాల్లోకి వెళితే… జక్రాన్‌పల్లికి చెందిన విలాస్‌ రిక్కల్‌కు దుబాయ్‌, అబుదాబిలో కోటి 50 లక్షల దరమ్‌ల లాటరీ టికెట్‌ వరించింది. భారత కరెన్సీలో అవి రూ.29 కోట్లతో సమానం. దీంతో విలాస్‌ అవధుల్లేనంత ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

జక్రాన్‌పల్లికి చెందిన విలాస్‌ గత రెండేళ్ళుగా దుబాయ్‌లో ఉంటూ ఉద్యోగం చేసి స్వదేశానికి తిరిగి వచ్చాడు. తిరిగి దుబాయ్‌ వెళ్ళి 45 రోజుల పాటు ఉద్యోగం కోసం వెతుకుతూ విఫల ప్రయత్నం చేశాడు. ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చాడు. వస్తూ వస్తూ తనవద్ద డబ్బులు లేకపోవడంతో తన భార్య పద్మ వద్ద 20 వేల రూపాయలు తీసుకొని మూడు లాటరీ టికెట్లు కొన్నాడు. అబుదాబిలో 223805 నెంబరుగల టికెట్‌కి కోటి 50 లక్షల ధరమ్‌ల లాటరీ తగిలిందని తెలియగానే విలాస్‌ రిక్కల్‌కు రెక్కలొచ్చాయి.

అంతకుముందు దుబాయ్‌లో డ్రైవర్‌లా పనిచేసి అబుదాబి నుంచి దుబాయ్‌కి విసిట్‌ వీసాతో వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేసి అక్కడ లాటరీ టికెట్‌ కొన్నాడు. గత రెండేళ్ళుగా లాటరీ టికెట్లు కొంటున్న విలాస్‌ 45 రోజుల క్రితం దుబాయ్‌ నుంచి వచ్చేటపుడు అలవాటు ప్రకారం మూడు టికెట్లు కొన్నాడు. అయితే ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విలాస్‌ దుబాయ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌లో టికెట్‌ కొనాలన్న బలమైన కోరిక భార్య పద్మకు తెలియజేశాడు. తనవద్ద ఉన్న 20 వేలు ఇచ్చింది. అబుదాబిలో ఉన్న తన మిత్రుడు రవికి పదివేల రూపాయల చొప్పున రెండు టికెట్లు కొనుమని చెప్పాడు. రెండు టికెట్లకు గాను మూడో టికెట్‌ ఉచితంగా రాగా మూడో టికెట్‌కు లాటరీ వచ్చింది. డబ్బు రావడానికి కారణం తన భార్య పద్మయేనని విలాస్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

డబ్బు తీసుకోవడానికి కటుంబ సమేతంగా వస్తారా అని యుఏఇ ప్రతినిధులు అడగగా ఇపుడు కాదు, కానీ డబ్బులు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులతో దుబాయ్‌ పర్యటన చేస్తానన్నాడు. లాటరీ విషయమై మీడియా ప్రతినిధులు విలాస్‌ను ప్రశ్నించగా సోమవారం మాట్లాడతానని, ఆదివారం తన కుటుంబీకులతో ఆనందంగా ఉన్నానని నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధితో చెప్పాడు. ప్రధానంగా వ్యవసాయ పనుల నిమిత్తం డబ్బు ఖర్చు చేయాల్సి ఉందని, ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు.

కాగా విలాస్‌కు భార్య, ఇద్దరు కూతుళ్ళు మనస్విని 8వ తరగతి, హిమని ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. ఆగష్టు 3 రోజున పెంటాస్టిక్‌ 15 మిలియన్‌ సిరీస్‌ 206 డ్రాలో లాటరీ వరించింది. ఎయిర్‌ పోర్టు అరైవల్‌ హాల్‌లో డ్రా తీయడం జరిగిందని చెప్పాడు. డ్రా హోస్ట్‌ ఫోన్‌ ద్వారా విలాస్‌కు వివరాలు తెలియపర్చాడు.

Check Also

25న ఉచిత వైద్య శిబిరం

కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *