Breaking News

అన్ని వివరాలతో జనాభా గణన నిర్వహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని రెండు డివిజన్లలో నిర్వహించే ముందస్తు జనాభా గణన అన్ని వివరాలతో జరగాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ప్రి టెస్ట్‌ సెన్సస్‌కు సంబంధించి పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈ నెల 6 నుండి 9 వరకు ఎన్యూమరేటర్‌లకు, సూపర్‌ వైజర్‌లకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2021 సంవత్సరంలో నిర్వహించే జనాభా గణనకు ముందు నగరంలోని 8, 11 డివిజన్లలో ప్రి టెస్ట్‌ గణన నిర్వహించుటకు ఈ రెండు డివిజన్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు.

శిక్షణ అనంతరం అక్టోబర్‌ 4 వరకు ఈ రెండు డివిజన్లలో అన్ని రకాల వివరాలను సేకరించాలని ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబాలకు సంబంధించిన అన్ని రకాల వివరాలను సేకరించి నమోదు చేయాలన్నారు. జనాభా సేకరణ భారతదేశం చేపట్టే అతిపెద్ద కార్యక్రమమని ఆయన తెలిపారు. జనాభాతో పాటు ఆయా కుటుంబాలకు సంబంధించిన చాలా వివరాలను సేకరించడం, వివరాలు క్రోడీకరించడం చాలా పెద్ద కార్యక్రమంతో కూడుకున్నదని, ఇదొక పెద్ద ఎక్ససైజ్‌ అని ఆయన తెలిపారు.

ఈ రకమైన ముందస్తు సేకరణ ద్వారా తదుపరి నిర్వహించే జనాభా సేకరణలో తలెత్తే ఇబ్బందులను, సమస్యలను అధిగమించడానికి ఈ ముందస్తు సేకరణ కార్యక్రమం బాగా ఉపకరిస్తుందని ఆయన తెలిపారు. ఈ వివరాల సేకరణ భారత ప్రభుత్వం నిర్దేశించిన అన్ని వివరాలను తు.చ. తప్పకుండా శ్రద్ధతో సేకరించాలని, అదేవిధంగా సంబంధిత మొబైల్‌ ఆప్‌లో ఈ వివరాలను నమోదు చేయాలన్నారు.

జనాభా సేకరణలో మొదటిసారిగా సాంకేతికతను ఉపయోగించుకొని వివరాలను నమోదు చేయనున్నామన్నారు. తద్వారా సేకరణకు సమయం తక్కువ పట్టడంతో పాటు తప్పులు తక్కువగా దొర్లుతాయని ఆయన తెలిపారు. నిజామాబాద్‌లోని రెండు డివిజన్లను ఈ సేకరణకు ఎంపిక చేసినందున వీలైనంత ఎక్కువగా యాప్‌ను ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు.

ఈ జనాభా సేకరణ వల్ల ప్రజల అక్షరాస్యత, స్త్రీ పురుష వివరాలు, సదుపాయాలు, అభివద్ధి, ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, ప్రజలకు వర్తించే పథకాలు, వారి ఆర్ధిక స్థితి గతులు, ఎంత మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారో తెలుస్తుందని తద్వారా ప్రభుత్వం అభివద్ధికి, పేదలకు తదుపరి చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని ఆయన తెలిపారు.

శిక్షణలో ఏమైనా అనుమానాలుంటే శిక్షకుల నుండి నివత్తి చేసుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సామ్సన్‌, మినిస్ట్రీ హోమ్‌ అఫైర్స్‌ రాష్ట్ర సహాయ సంచాలకులు చంద్రకళ, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *