Breaking News

ఆహార భద్రత చట్టం అమలయ్యేలా చూడాలి

నిజామాబాద్‌, ఆగష్టు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదలకు ఆరోగ్యకరమైన, ఆకలి తీర్చే పౌష్టిక ఆహారాన్ని అందించడం అందరి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్‌ చైర్మన్‌ కె. తిర్మల్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం, బుధవారం రెండు రోజులపాటు కమిషన్‌ పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో కమిషన్‌ సభ్యులతో సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆహార భద్రతకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముఖ్యంగా అంగన్‌వాడి కేంద్రాలలో మహిళలకు పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కొత్తగా రేషన్‌ కార్డులకై దరఖాస్తు చేసుకున్నారు. ప్రజలకు జారీ చేసిన కార్డుల విషయాలు, రేషన్‌ సరుకుల సరఫరా, ఇబ్బందులు తదితర విషయాలపై సంబంధిత శాఖల అధికారులు రేషన్‌ డీలర్లు, మండల విద్యాశాఖ అధికారులు, తహసీల్దార్లు తదితర అధికారులతో సుదీర్ఘంగా మూడున్నర గంటలకు పైగా లోతుగా సమీక్షించడంతో పాటు మంగళవారం ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి, నిజామాబాద్‌ మండలాల్లో వారి పర్యటన సందర్భంగా తెలుసుకున్న లోటుపాట్లను అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ రేషన్‌ కార్డు దరఖాస్తు చేసుకున్న అందరికీ కార్డులు అందించి వారికి బియ్యం, నిత్యావసర వస్తువులు సక్రమంగా సకాలంలో పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించారు. పేద ప్రజలకు ఆహారానికి సంబంధించిన బియ్యం ఇతర వస్తువులు అందించడం చట్టం కల్పించిన హక్కు అని అధికారులు, ఉద్యోగులు రేషన్‌ డీలర్లు ఈ విషయంలో ఖచ్చితంగా లబ్ధిదారులకు అన్యాయం చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని ఆయన స్పష్టం చేశారు.

జిల్లాలో 751, రాష్ట్రవ్యాప్తంగా 17 వేలకు పైగా రేషన్‌ దుకాణాల ద్వారా ప్రజలకు అందిస్తున్న బియ్యం, ఇతర వస్తువులు సరైన రీతిలో అందించడం అందరి బాధ్యత అని, ప్రజలకు పంపిణీ చేయని నిత్యావసర వస్తువులు తిరిగి ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలని ఇందులో అక్రమాలకు అవకాశం కల్పిస్తే డీలర్ల పైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

అదేవిధంగా రేషన్‌ బియ్యం డీలర్లకు తూకంలో బియ్యం తక్కువ కాకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉన్నదని తెలిపారు. అంగన్‌వాడి కేంద్రాలకు పంపించే బియ్యానికి రవాణా చార్జీలు చెల్లించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. భారతదేశంలో 37 శాతం పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ప్రభుత్వ పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాల్లో మెనూ జాబితాలు ప్రదర్శించేలా చూడాలని నిష్ణాతులతో పౌష్టికాహార మెనూ తయారు చేశారని, ఈ మెనూ ప్రకారం వారికి ప్రతిరోజు భోజనం అందించడానికి అధికారులు వారి పర్యటనలో పర్యవేక్షణ తనిఖీలు చేయాలని ఆదేశించారు.

రేషన్‌ డీలర్లు వారి విధుల పట్ల గౌరవంగా ఉండాలని ప్రజలకు అవసరమైన ఆహారాన్ని అందించడంలో చట్ట పరిధిలో నియామకమైన డీలర్ల బాధ్యత కూడా ఉందని అన్నారు. చట్టం నిర్దేశించిన బాధ్యతలను పనిచేయాలని ఫిర్యాదు వస్తే చట్టం చర్యలు తీసుకోక తప్పదని తెలిపారు. వికలాంగులు, రేషన్‌ దుకాణాలకు రాలేని వారికి రేషన్‌ను వారింటికి చేర్చాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు.

పెండింగులో ఉన్న కొత్త రేషన్‌ కార్డులను జారి చేయుటకు, లోటుపాట్లు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకొనుటకు ఈ-పాస్‌ ద్వారా నిత్యావసర వస్తువులు సరిగా సరైన సమయంలో పంపిణీ జరుగుటకు సాంకేతిక సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సోషల్‌ ఆడిట్‌ విజిలెన్స్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని, సంయుక్త కలెక్టర్‌ నెల రోజుల్లో ఈ విషయాలపై విచారణ చేసి నివేదికలు అందచేయాలని తెలిపారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ ఆహార భద్రత చట్టం 2013 ద్వారా రాష్ట్రానికి కమిషన్‌ నియామకం జరిగిందని, అందరికీ ఆహారం అందే విధంగా, సరిపోయే విధంగా అవసరమైన ఆహార వస్తువులు అందుతున్నాయో లేదో చూడడానికి కమిషన్‌ పనిచేస్తుందని, నిత్యావసర వస్తువులతో పాటు నాణ్యమైన వస్తువుల పంపిణీ అందేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

పాఠశాలలు, వసతి గహాలు, అంగన్‌వాడి కేంద్రాలలో పిల్లలకు, తల్లులకు పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు అర్హులకు అందడానికి అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకొని సరైన మార్గంలో జరిగేలా చూడాల్సి ఉందని కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందించడంతోపాటు అనర్హులు ఉంటే తొలగించవలసిన అవసరం కూడా ఉందని తెలిపారు.

గత రెండు సీజన్లలో మన జిల్లా వరి ధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇందుకుగాను కషిచేసిన యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని, సేకరించడంతో పాటు అది నాణ్యతతో ప్రజలకు అందేలా చూడవలసిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు. పిల్లలకు, తల్లులకు, విద్యార్థులకు పాఠశాలల్లో, అంగన్‌ వాడి కేంద్రాలు పౌష్టికాహారం అందించడానికి, మెనూ ప్రకారం ప్రతి ఒక్కరు కషి చేయవలసి ఉందని తెలిపారు.

మండల విద్యా అధికారులు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, మధ్యాహ్న భోజన కమిటీలు సకాలంలో, పరిశుభ్రమైన పౌష్టిక ఆహారం అందించడానికి కషి చేయాల్సిన అవసరం ఉందని, వాటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, త్రాగునీరు స్వచ్ఛమైనది అందించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.

కార్యక్రమంలో ఓరకంటి ఆనంద్‌, రంగినేని శారదా భారతి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, రెవిన్యూ డివిజనల్‌ అధికారి వెంకటేశ్వరులు, జిల్లా అధికారులు రమేష్‌ రాథోడ్‌, సుదర్శనం, గోవిందు, దుర్గాప్రసాద్‌, స్రవంతి, డిసిఎస్‌ఓ పద్మజ, తహసీల్దార్లు, ఎంఈవోలు, సిడిపివోలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *