Breaking News

జాబ్‌ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఆగష్టు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ మేళా ద్వారా ఎక్కువమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని దానిని సద్వినియోగం చేసుకోవాలని అర్బన్‌ శాసనసభ్యులు గణేష్‌ గుప్త అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో గురువారం స్థానిక కళ్యాణ మండపంలో ఉచిత మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఒకవైపు తమ అర్హతకు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయో తెలియని యువత మరోవైపు ఆయా కంపెనీలకు అర్హులైన ఉద్యోగులు ఎక్కడ ఉంటారు, తదితర సమస్యలను అధిగమించడానికి జాబ్‌ మేళా సరైన వేదిక అని అన్నారు.

తద్వారా ఆయా కంపెనీల ద్వారా తమకు కావలసిన ఉద్యోగులను నియమించుకోవడానికి నిరుద్యోగులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పొందడానికి ఈ అవకాశం బాగా ఉపకరిస్తుందని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లల భవిష్యత్తు కొరకు తాహతుకు మించి చదువుల కోసం ఖర్చు చేస్తారని, పిల్లలు కూడా వారి భవిష్యత్తుకై బంగారు కలలు కంటారని ఈ వేదికల ద్వారా మీ ఆశయాలు నెరవేరడానికి అవకాశం ఉందన్నారు.

మంచి ఉద్యోగ అవకాశాలు పొందడానికి యువత తమ ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవడానికి స్కిల్స్‌కు సంబంధించి శిక్షణను తీసుకోవాలన్నారు. తద్వారా ఒక చోట కాకుండా మరో చోట ఉద్యోగాలు పొందడానికి లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయని ఒక చోట రానందుకు నిరుత్సాహపడకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలని ప్రతి ఒక్కరికి అవకాశం లభిస్తుందని తెలిపారు.

హైదరాబాద్‌ తర్వాత నిజామాబాదులో ఐ.టి. ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి గత సంవత్సరం ఐటి హబ్‌ను శంకుస్థాపన చేసుకున్నామని త్వరలోనే పనులు పూర్తి చేసుకొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవసరమైన శిక్షణ అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకు అనుగుణంగా ఐటి హబ్‌కు వెళ్లడానికి నాలుగు లైన్ల రోడ్డును వెడల్పు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

ఇలాంటి జాబ్‌ మేళా కార్యక్రమాలు రెగ్యులర్‌గా నిర్వహించాలని తద్వారా యువతకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని, ఇందుకుగాను తన వంతుగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా తెలంగాణను సాధించడం జరిగిందని ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ద్వారా రాష్ట్రంలోని లక్షల ఎకరాలకు నీరందించే కార్యక్రమాలు ఇప్పటికే కొనసాగుతున్నాయని ఇందుకు అనుగుణంగా భారీగా వర్షాలు కూడా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే అన్ని శాఖలలో కారుణ్య నియామకాలు పూర్తి చేయడం జరిగిందని, కేవలం ప్రభుత్వాలపై ఆధారపడకుండా ప్రైవేటు సంస్థలలో కూడా నియామకాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెద్ద సంఖ్యలో లభిస్తున్నాయని అన్నారు.

ఈ మెగా జాబ్‌ మేళా ద్వారా 2200 పైగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని ఇందుకై దేశంలోనే మొదటిసారిగా ఆప్‌ ను క్రియేట్‌ చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులందరూ ఈ ఆప్‌ ద్వారానే తమ అభ్యర్థిత్వాన్ని స్వయంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారన్నారు. ఉద్యోగాలు ఆశించే యువత సాఫ్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై పట్టు సాధించి ఉండాలని, తద్వారా ఉద్యోగం పొందడానికి ముందు, పొందిన తర్వాత కూడా వారు సులభంగా వారి లక్ష్యాలను చేరుకోవడానికి వీలవుతుందన్నారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయులు, వీఆర్‌ఏలు, వీఆర్వో తదితర ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని కూడా సాధించడానికి యువత అవసరమైన పరిజ్ఞానాన్ని, అర్హతలను పెంపొందించుకోవాలని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసుకోబోయే ఐటి హబ్‌ ద్వారా యువతకు మంచి అవకాశాలు లభిస్తాయని జిల్లాకు ఇది ఒక మకుటంగా నిలబడనుందని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు ఉండడంతోపాటు వినూత్నంగా ఆలోచించి తమతో పాటు మరికొందరికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా కషి చేయాలని ప్రయోగాలు చేయాలని ఆయన యువతకు సూచించారు.

అంతకుముందు రిబ్బన్‌ కత్తిరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నిజామాబాద్‌, భీమ్‌గల్‌ మున్సిపల్‌ కమిషనర్లు జాన్‌ సామ్సన్‌, గంగాధర్‌, మెప్మా పిడి రాములు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్‌ పర్సన్‌ ఆకుల సుజాత, కంపెనీల ప్రతినిధులు, యువత, తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *