Breaking News

అడవుల పెంపకం వాతావరణంలో మార్పు తెస్తుంది

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, ఆగష్టు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ భూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించి, కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కలెక్టర్లను కోరారు. సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే.. అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందని, వర్షాలు బాగా కురవడానికి జీవ వైవిధ్యానికి దోహద పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు.

సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలోని సింగాయపల్లి, నెంటూరు, కోమటి బండ తదితర ప్రాంతాలలో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను బుధవారం ఉదయం రాష్ట్రంలోని అన్నీ జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా చూపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని అటవీభూములు చెట్లులేని ఎడారుల్లా మారిన దుస్థితి ఉండేదని చెప్పుకొచ్చారు.

అటవీ భూముల్లో అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేసినట్లు వెల్లడించారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన పునరుద్ధరణ సత్ఫలితాలు ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని సీఎం అన్నారు. ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతున్నదని, వర్షపాతం కూడా పెరిగిందని తెలిపారు. 27 రకాల పండ్ల మొక్కలను కూడా ఈ అడవుల్లో పెంచడం వల్ల ఇవి కోతుల-మంకీ ఫుడ్‌ కోర్టుల లాగా తయారవుతున్నాయని సీఎం చెప్పారు.

గజ్వేల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని, రాష్ట్ర వ్యాప్తంగా అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని కోరారు. రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీ భూమి ఉందని, ఇది మన భూభాగంలో 23.4 శాతం అని సీఎం అన్నారు. ఇంత అటవీభూమి ఉన్నప్పటికీ అదే నిష్పత్తిలో అడవులు లేవని చెప్పారు. గజ్వేల్‌ అటవీ ప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అటవీశాఖ పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, అడిషనల్‌ పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం.డోబ్రియాల్‌ కలెక్టర్లకు వివరించారు.

అడవుల్లో ఉన్న రూట్‌ స్టాక్‌ను ఉపయోగించుకుని అడవుల్లో సహజమైన పద్ధతిలో చెట్ల పెంపకం చేపట్టామని సవివరంగా వివరిస్తూ.., అడవి చుట్టూ కందకాలు తీసామని, దీనివల్ల అడవికి రక్షణ ఏర్పడుతుందని బయటి జంతువులు లోపలకు రావడంగానీ, లోపలి జంతువులు బయటకు వెళ్లడం కానీ, సాధ్యం కాదని చెప్పారు. ఆ కందకాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల చెట్లకు కావల్సిన తేమ అందుతుందని, కందకాల కట్టలపై గచ్చకాయ చెట్లు నాటడం వల్ల అడవికి సహజమైన రక్షణ ఏర్పడుతుందని తెలిపారు.

27 రకాల పండ్ల చెట్లు కూడా అడవుల్లో పెంచుతున్నామని, దీనివల్ల గ్రామాలు, పట్టణాల్లోని కోతులు అడవికి వాపస్‌ పోతున్నాయని అటవీశాఖ అధికారులు చెప్పారు. అడవుల పునరుద్ధరణ వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని, వర్షపాతం పెరుగుతుందని, జీవ వైవిధ్యానికి అవకాశం కలుగుతుందని అటవీశాఖ అధికారులు కలెక్టర్లకు చెప్పారు. ఆయా జిల్లాల్లో అటవీభూముల్లో అడవుల పునరుద్ధరణకు అవసరమయ్యే కాంపా నిధులు అందుబాటులో ఉన్నాయని చెట్ల పెంపకానికి అవసరమైన చర్యలు అటవీశాఖ ద్వారా తీసుకుంటామని చెప్పారు.

మనకు ఉన్న అడవులను కాపాడుకోవాలని అందులో మొక్కలు నాటి అడవిని పునరుద్ధరించాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఈ బాధ్యతను తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సూచించారు. అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం కలెక్టర్లు కోమటిబండలో నిర్మించిన మిషన్‌ భగీరథ ప్లాంటును సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కలెక్టర్లతో సమావేశమయ్యారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, కొత్త మున్సిపల్‌ చట్టం అమలుపైన, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపైన కలెక్టర్లతో సీఎం చర్చించారు.

పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కోరారు. అవినీతికి ఆస్కారం లేని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నదని ముఖ్యమంత్రి వివరించారు.

కార్యక్రమాల్లో మంత్రులు ఎ.ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఈటల రాజేందర్‌, జగదీశ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, నిరంజన్‌ రెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, శేరి సుభాష్‌ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *