Breaking News

హరిత, ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దడంలో సర్పంచ్‌లదే కీలకపాత్ర

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలను హరిత వనంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. 30 రోజుల గ్రామ పంచాయతీల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై స్థానిక బిఎల్‌ఎన్‌ గార్డెన్‌లో ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రపతి తర్వాత సర్పంచ్‌ను మాత్రమే ప్రథమ పౌరుడు అంటారని, అదేవిధంగా రాష్ట్రపతి తర్వాత ఒక్క సర్పంచ్‌కు మాత్రమే చెక్‌ పవర్‌ ఉంటుందని సర్పంచు పదవికి చట్టంలో అంత గౌరవం కల్పించారన్నారు. ఆ గౌరవానికి వన్నె తెస్తు గ్రామాల్లో సర్పంచులు గ్రామాల అభివద్ధికి, పారిశుద్ధ్య కార్యక్రమాలకు, ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దడానికి అంతగా వారి పాత్రను పోషించవలసి ఉంటుందని ఆయన తెలిపారు.

బాగా పని చేస్తే ఇదే రిజర్వేషన్లతో మళ్లీ జరిగే ఎలక్షన్లలో ప్రజలు వారినే ఎన్నుకునే విధంగా గ్రామాలను వారి నాయకత్వంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకొని తీర్చిదిద్దాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిర్దేశించిన 30 రోజుల కార్యక్రమం ఎంతో ముందు చూపుతో గ్రామాల అభివద్ధిని, ప్రజల ఆరోగ్యాన్ని దష్టిలో పెట్టుకొని రూపొందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే రోగాల బారిన పడకూడదంటే స్వచ్ఛమైన గాలి, నీరు, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు గ్రామాలు శుభ్రంగా ఉండటం కావాలన్నారు. ఇందుకుగాను పంచాయతీ చట్టం ప్రకారం గ్రామాలను అభివద్ధి చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ నెల 6 నుండి ప్రారంభమయ్యే నెలరోజుల కార్యక్రమంలో వార్షిక, పంచవర్ష ప్రణాళికల కార్యాచరణతో గ్రామాలను ఏ విధంగా అభివద్ధి చేసుకోవాలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయంతో ప్రాధాన్యత క్రమంలో చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామాలకు ప్రతి నెల 339 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని తెలిపినందున అందులో ప్రతి గ్రామంలో జనాభా ప్రాతిపదికగా సరా సరిగా పదహారు వందల ఐదు రూపాయలు విడుదల చేస్తారని ఈ నిధులతో గ్రామానికి కావలసిన అభివద్ధి పనులను చేపట్టాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామంలో పరిశుభ్రత, పచ్చదనం, స్వచ్ఛమైన తాగునీరు, వీధి దీపాలు ఏర్పాటు చేసుకోవడం, పాడుబడ్డ బావులను పూడ్చాలని, శిధిలావస్థలో ఉన్న ఇండ్లను పిచ్చి మొక్కలను తొలగించాలని తెలిపారు.

మీరు చేసేది మంచి పని కాబట్టి అది ఎటువంటి పని అయినా సరే తల వంచ వలసిన అవసరం లేదని తెలిపారు. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి తనతో రోడ్డు బాగా లేదని దాన్ని శుభ్రం చేయాలని తనతో అంటే తాను తప్పకుండా ఆ రోడ్డును ఊడుస్తానని అప్పుడే ప్రజలకు కూడా అవగాహన వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలతో పాటు అంగన్‌వాడి కేంద్రాల్లో, పాఠశాలల్లో పిల్లలకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించాలని, వీలైతే వారితో కలిసి భోజనం చేయాలని స్పీకర్‌ సూచించారు.

హరితహారం లో భాగంగా ప్రాణ వాయువు నిచ్చే, వర్షాల నిచ్చే మొక్కలు నాటాలని ప్రతి గ్రామానికి ట్రాక్టర్లు సమకూర్చుకోవడానికి అవకాశం ఇచ్చినందున వాటి ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలకు చెట్లకు నీటిని సరఫరా చేయుటకు తొలగించుటకు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. సిక్కిం రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా సేంద్రియ ఎరువులతో చేస్తారని, అధికంగా రసాయన ఎరువులు, పురుగుమందులు ఉపయోగించే రాష్ట్రాలలో పంజాబ్‌ మొదటి స్థానంలో ఉందని మన రాష్ట్రం రెండో స్థానంలో ఉందని దీనిని మార్చు కోవడానికి మనమంతా ఆలోచించాలని ఆయన ఉద్బోధించారు.

ఈ మార్పు ఇప్పుడే మొదలైందని ముందు ముందు మరింత అవగాహనతో మార్పు రావచ్చని ఆయన అభిలషించారు. చట్టం కఠినంగా ఉందని 30 రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలపై ప్లయింగ్‌ స్క్వార్డ్స్‌ పనితీరును పరిశీలిస్తారని, సర్పంచులు కార్యదర్శులు ఉద్యోగులు పని చేయకుంటే ఇబ్బందులు తప్పవని ఆయన తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ 30 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.

ఈ కార్యక్రమం ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలవుతుందని కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలో 4 స్థాయి సంఘాలను గ్రామ సభల ద్వారా ఎన్నిక చేసుకోవాలని వాటి ద్వారా స్మశానవాటికలు, వీధిదీపాలు, హరితహారం కార్యక్రమాలను నిర్వహించుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడ కూడా మురుగునీరు ఆగకుండా చూడాలని మోరీలు శుభ్రం చేయాలని చెత్త చెదారం ఎక్కడ కూడా కనిపించకూడదని పరిసరాలు శుభ్రంగా ఉండాలని ఈ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటాలని కోతుల బెడద నుండి తప్పించుకోవడానికి పండ్ల మొక్కలను, దోమల బెడద నివారించడానికి తులసి, కష్ణ తులసి తదితర చెట్లను పెంచాలని పరిశుభ్ర వాతావరణం ద్వారా వ్యాధులు దోమలు రాకుండా ఉంటాయని ఆయన తెలిపారు. అనవసర సమయాల్లో విద్యుత్‌ దీపాలు వెలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుప్పు పట్టిన స్తంభాలను మార్చాలని వార్షిక, పంచవర్ష ప్రణాళికలను గ్రామ సభలో ఆమోదించాలని వాటినే అమలు చేయాలని ఆయన సూచించారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు మాట్లాడుతూ గ్రామాలను తద్వారా జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పనిచేసి మెరుగైన సేవలు అందించాలని అప్పుడే గాంధీజీ కలలు కన్న పల్లెలు కనిపిస్తాయని తెలిపారు. సర్పంచ్‌లే కథానాయకులు కాబట్టి మీరు తలుచుకుంటే జిల్లాను, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చని తద్వారా జిల్లాకు పది కోట్ల రూపాయలు మంజూరు కావడానికి అవకాశం ఉంటుందన్నారు.

అవగాహన సదస్సులో జిల్లా అటవీ అధికారి సునీల్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ సుదర్శన్‌, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జిల్లా పరిషత్‌ సీఈవో గోవింద్‌, డి ఆర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్పర్సన్‌ రజిత, మండల పరిషత్‌ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *