Breaking News

రక్తదాత అపరబ్రహ్మ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్తదాత మరో అపర బ్రహ్మ అవతారమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని పంచాయతీరాజ్‌ టీచర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సహకారంతో జరిగిన రక్తదాన శిబిరంలో దాదాపు 180 మంది ఉపాధ్యాయులు రక్తదానం చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ ఉపాధ్యాయులను అభినందిస్తూ మాట్లాడారు.

వ్యవస్థను సన్మార్గంలో పెట్టేది గురువేనని, విద్యార్థికి కాగడా లాగా గురువు దారి చూపుతాడని, అలాంటి గురువులు ఇలాంటి సమాజహిత కార్యక్రమాల్లో పాల్గొనడం సమాజానికి మహోపకారం చేసినట్లు అని అన్నారు. ఉపాధ్యాయులు గత సంవత్సరం 105 మంది రక్తదానం చేస్తే ఈ సంవత్సరం 180 మంది చేయడం వారి ఉత్సాహానికి నిదర్శనమని, ఇలానే ఇంకా ముందు ముందు రక్తదాన శిబిరాలను ఎక్కువ సంఖ్యలో చేయాలని అభిలషించారు.

రక్తదానం చేయడంలో అర్థం పరమార్థం ఉందని, మనిషి జీవితం ఒక వరమని, మరొకరికి జీవితం అందించడం ద్వారా తాను ధన్యుడు అవుతారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పాటు గురువులు విద్యార్థుల భవిష్యత్తుకు తమ శక్తి యుక్తులను ధారపోసి విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని తెలిపారు.

కామారెడ్డి జిల్లా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని, రక్తదాన సేకరణలో ఇప్పటివరకు 91 రక్తదాన శిబిరాలు నిర్వహించి 3500 యూనిట్ల రక్తం సేకరించి కొత్త జిల్లాలలో ప్రధమ స్థానంలో ఉన్నామని, అంతే కాకుండా ఇతర జిల్లాలకు కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిరుమల రెడ్డి మాట్లాడుతూ, గురువులు తమ బాధ్యతలను ఇంకా విస్తత పరుచుకొని విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలని, ఇంకా అనేక సమాజహిత పనులలో పాలుపంచుకోవాలని తెలిపారు.

అనంతరం రక్తదానం చేసిన ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్‌ శాలువలు, జ్ఞాపికలతో సత్కరించారు. రక్తదాన శిబిరం కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ అంజిరెడ్డి, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా జనరల్‌ సెక్రెటరీ రాజన్న, జిల్లా విద్యాధికారి రాజు, ఎంపీపీ నీరజ వెంకట్‌ రామ్‌ రెడ్డి, జెడ్పిటిసి పద్మ గోపాల్‌ రెడ్డి, ఎంఆర్‌ఓ సుదర్శన్‌, ఎంపీడీవో సయ్యద్‌ సూఫీ, ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు దామోదర్‌ రెడ్డి, సెక్రెటరీ కుశాల్‌, వివిధ మండల స్థాయి అధ్యక్షులు, సెక్రటరీలు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *