Breaking News

30 రోజుల ప్రణాళిక పనులు స్పష్టంగా కనిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల రూపురేఖలు మార్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పనుల్లో మార్పు స్పష్టంగా కనిపించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల, గ్రామస్థాయి అధికారులతో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై పలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కార్యక్రమము ఏ ఒక్క అధికారికో మరెవరికో సంబంధించింది కాదని పూర్తి యంత్రాంగానికి బాధ్యత ఉన్నదని, ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములై వారి విధులు నిర్వహించి గ్రామాల్లో మార్పు స్పష్టంగా కనిపించేలా చూడాలని ఆదేశించారు. కనీసం 20 నుండి 35 మంది వరకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ప్రతి గ్రామంలో విధులు నిర్వహిస్తున్నారని వీరంతా సమన్వయంతో, ప్రణాళికతో పనులు చేపడితే మార్పు కచ్చితంగా కనిపిస్తుందని తెలిపారు.

నిర్దేశించిన రోజువారి పనుల కార్యక్రమాల ప్రకారం ఏరోజు కారోజు పనులు ఖచ్చితంగా నిర్వహించాలని తెలిపారు. అందుకు అనుగుణంగా ముందుగానే పనులకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఉదాహరణకు ఒక తేదీన హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నప్పుడు దానికి అవసరమైన మొక్కలను తెప్పించుకోవడం, గుంతలు తీయించి సిద్ధంగా ఉంచుకోవడం, మొక్కలు నాటే వారికి సమాచారం ఇచ్చి వారు ఆ ప్రాంతాలకు చేరుకునేలా చూడడం తదితర కార్యక్రమాలని ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు.

ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించాలని, మోరీలు శుభ్రం చేయాలని, గుంతలు పూడ్చాలని, శిధిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించాలని, పిచ్చి మొక్కలను, చెత్తను, ప్లాస్టిక్‌ చెత్తను, ఏరోజు కారోజు తొలగించాలన్నారు. ఎక్కడ కూడా నీరు నిలవకుండా, దోమలు ప్రబలకుండా చూడాలని, ప్రతి ఇంటికి తులసి, కష్ణ తులసి, వేప, పండ్ల మొక్కలు రోజ్‌ మేరీ మొక్కలు సరఫరా చేయాలని, ప్రతి కుటుంబం ద్వారా కనీసం పదిహేను మొక్కలు నాటించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

నాటిన మొక్కలలో కనీసం 85 శాతం బతికేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే సంబంధిత సర్పంచ్‌, గ్రామ కార్యదర్శులపై చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏ గ్రామానికి వెళ్లినా ఆ గ్రామ ప్రారంభంలోనే పచ్చదనం పరిశుభ్రత స్పష్టంగా కనిపించాలన్నారు. వీధిలైట్లు డే టైంలో వెలుగ కుండా చూడాలని, ఎల్‌ఇడి లైట్లు గల స్తంభాలకు థర్డ్‌ వైర్‌ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.

విరిగిన, వంగిన, తుప్పు పట్టిన విద్యుత్‌ స్తంభాలను మార్చాలన్నారు. ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు కో ఆప్షన్‌ సభ్యులు విధిగా గ్రామసభ కార్యక్రమాల్లో పాల్గొనాలని వారికి బదులు వేరొకరు పాల్గొన కూడ దన్నారు. కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా ప్రారంభం నాటికి, ప్రతి వారానికి, నెల రోజులకు గ్రామంలో పారిశుద్య, అభివద్ధి, ఆరోగ్య కార్యక్రమాల నిర్వహించిన కార్యక్రమాలు స్పష్టంగా కనిపించాలన్నారు.

30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఎక్కడైనా లోపాలుంటే సంబంధిత మండల, గ్రామ ప్రత్యేక అధికారులను బాధ్యులను చేయడం జరుగుతుందని తెలిపారు. ఎల్‌ఆర్‌యుపి పై రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ కోర్టు కేసులు, పూర్తిగా అనర్హత గలిగిన కేసులు మినహా పెండింగ్‌లో ఉన్న అన్ని ఖాతాలకు పాస్‌బుక్కులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి, రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి అధికారులు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్‌ సీఈవో గోవిందు, జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ, డిఆర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌, జిల్లా సంక్షేమ అధికారిణి స్రవంతి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ బాబురావు, జిల్లా పరిషత్‌ ఏవో కష్ణమూర్తి, కలెక్టరేట్‌ ఏవో శ్రీధర్‌, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *