Breaking News

ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లాస్టిక్‌ రహిత పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. 30 రోజుల గ్రామ పంచాయితీల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం బోధన్‌ మండలంలోని ఊట్‌పల్లి రాజీవ్‌ నగర్‌ తండా గ్రామాలలో జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా కో ఆప్షన్‌ స్టాండింగ్‌ కమిటీల ఎన్నికలను పూర్తిచేయాలని ఎంపిక పూర్తయిన తర్వాత గ్రామాల్లో ప్రతి వాడలో తిరిగి అక్కడున్న సమస్యలను గుర్తించాలని, అదేవిధంగా చెత్తా చెదారాన్ని మురుగు కాలువల పరిశుభ్రంగా ఉంచడం, పిచ్చి మొక్కలను తొలగించడం, గుంతల్లో నిలిచిన నీటిని తొలగించి పరిశుభ్రమైన గ్రామంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఇందుకోసం గ్రామస్తులందరి సహకారం తీసుకోవాలన్నారు. చెత్తను ప్లాస్టిక్‌ బయట పడకుండా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ కష్ణను కోరారు. కో ఆప్షన్‌ స్టాండింగ్‌ కమిటీల ఎంపిక చేశారా అని సర్పంచ్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామ కార్యదర్శి రెండు గ్రామాలకు ఒక్కరే ఉన్నందున మధ్యాహ్నం ఎంపిక చేసుకుంటామని సర్పంచ్‌ కలెక్టర్‌కు వివరించారు.

అక్కడికి వచ్చిన గ్రామ ప్రజలు ఇంకా రెవెన్యూ పట్టాలు సుమారు 150 మందికి ఇవ్వాల్సి ఉందని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. అక్కడి నుండి బోధన్‌ మండల తహసిల్దార్‌కు ఫోన్‌ చేసి పిలిపించి గ్రామస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ గ్రామానికి ఇప్పటికే ముగ్గురు వీఆర్వోలకు పోస్టింగ్‌లిచ్చి కొద్దిరోజులపాటు పని చేసిన తర్వాత తిరిగి బదిలీ చేస్తున్నారని, అందువలన భూ ప్రక్షాళనలో జాప్యం అవుతున్నందున శాశ్వతంగా ఉండేవిధంగా విఆర్‌ఓను నియమించాలని, అంతేకాకుండా గ్రామ కార్యదర్శిని కూడా నియమించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు.

గ్రామానికి మంజూరైన బిటి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయించాలని, మట్టి పనులు చేసినందున వర్షాకాలం ఈ రోడ్డు వలన గ్రామస్తులకు ఇబ్బంది కలుగుతుందని కలెక్టర్‌కు వివరించారు. సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసి యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *