Breaking News

గణేష్‌ శోభాయాత్ర దారిని పరిశీలించిన కలెక్టర్‌, సిపి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 12న గణేష్‌ విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కరించుకుని రథం బయలుదేరే మార్గాన్ని కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, సిపి కార్తికేయ పరిశీలించారు. సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌, ఇతర అధికారులతో కలిసి వారు రథం తిరిగే ప్రాంతాల్లో పర్యటించి సదుపాయాలను పర్యవేక్షించారు. స్థానిక దుబ్బ నుండి లలితా మహాల్‌ థియేటర్‌, గాంధీ గంజు, గాంధీచౌక్‌, బోధన్‌ రోడ్‌, గాజులపేట, పెద్ద బజార్‌, గోల్‌ హనుమాన్‌, ఫులాంగ్‌, మీదుగా వినాయక నగర్‌లోని గణపతులు నిమజ్జనం చేసే వినాయకుల బావి వరకు వారు పర్యటించారు.

ఈ సందర్భంగా ఎక్కడికక్కడ మున్సిపల్‌, ఆర్‌అండ్‌ బి, విద్యుత్‌ శాఖ అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వినాయకుల రథం వెళ్లేదారిలో ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇప్పటికే చాలా పనులు పూర్తి చేయడం జరిగిందని, చిన్నచిన్న పనులు త్వరలోనే పూర్తి చేయవలసిందిగా తెలిపామన్నారు.

కరెంటు తీగలు అడ్డంగా లేకుండా చూడవలసిందిగా, అవసరమైన చోట లైటింగ్‌, త్రాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. మూడు అడుగుల లోపు గణేష్‌ విగ్రహాలను వినాయకుల బావిలో నిమజ్జనం చేయవలసినదిగా, అంతకంటే పెద్ద విగ్రహాలను బాసరలో నిమజ్జనం చేయవలసిందిగా ఆయన గణేష్‌ మండలి ప్రతినిధులకు సూచించారు. బాసరలో అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయుటకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు.

ప్రజలు శాంతియుత వాతావరణంలో, మతసామరస్యంతో గణేష్‌ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయ్యేలా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించాలని, జిల్లా యంత్రాంగానికి తోడుగా ఉండాలని ఆయన ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కోరారు. పరిశీలన సందర్భంగా అదనపు సీపీ శ్రీధర్‌ రెడ్డి, ఏసిపి శ్రీనివాస్‌ కుమార్‌, ఆర్డివో వెంకటేశ్వర్లు, సార్వజనిక్‌ గణేష్‌ మండలి అధ్యక్షుడు గణేష్‌, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బి, రెవెన్యూ, పోలీస్‌, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *