Breaking News

తెలంగాణ వైతాళికుడు కాళోజీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెరాస యువజన విభాగం కార్యాలయంలో కాళోజీ నారాయణరావు 104 వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెరాస యువజన విభాగం అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్‌ మాట్లాడుతూ తెలంగాణనే ఉపిరిగా జీవించిన మహానీయుడు కాళోజీ అన్నారు.

రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాసరాం రాజా కాళోజీ సెప్టెంబరు 9, 1914లో జన్మించి నవంబరు 13, 2002 పరమపదించారన్నారు. కాళోజీ నారాయణరావు, కాళోజీగా, కాళన్నగా సుపరిచితులని, ఆయన తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడన్నారు. ఆయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కవిత్వం వ్రాసిన ప్రజాకవి అని, హక్కులడిగిన ప్రజల మనిషి అని, ఉద్యమం నడిపిన ప్రజావాదిగా కాళోజిని పేర్కొన్నారు.

మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి అని, పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి అన్నారు. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడని, ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడని అన్నారు. ఆయన 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్నారని, ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించిందన్నారు.

వరంగల్‌లో నెలకొన్న వైద్య విద్యాలయానికి ఆయన పేరు పెట్టబడిందని, కాళోజీ నారాయణరావు ఆశయాలను కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ నాయత్వంలో ముందుకు తీసుకుపోతామన్నారు. కార్యక్రమంలో తెరాస యువజన విభాగం పట్టణ నాయకులు పిల్లమరి సతీశ్‌, బాబా గౌడ్‌, రమేశ్‌, నవీన్‌, సత్యం, భరత్‌, శ్రవణ్‌ కుమార్‌, నిఖిల్‌, గణేష్‌, నిఖిల్‌ రెడ్డి, నితిన్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *