Breaking News

గ్రామాలు పరిశుభ్రంగా కనిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాలన్నీ పరిశుభ్రంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోనూ, దర్పల్లి మండలం కేంద్రంలోను, ఇందల్వాయి మండలం తిర్మన్‌ పల్లి గ్రామంలోనూ పర్యటించి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన వీధులలో పర్యటించి గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య తదితర కార్యక్రమాలను పర్యవేక్షించారు. దుబ్బాక గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పర్యటించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. కొత్త మెనూ ప్రదర్శించక పోవడంపై ప్రధానోపాధ్యాయురాలిని ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని మెనూతో అందించాలన్నారు.

విద్యార్థులతో మాట్లాడి వారికి బోధిస్తున్న పాఠాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలస్థాయి, గ్రామస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో ముందే నిర్దేశించుకున్న ప్రకారం పనులు ఏ రోజుకారోజు తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. ఆయా పనులకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, అంతకంటే ముందు రోజుల్లోనే చేసుకోవాలని ఆదేశించారు.

ప్రతి గ్రామంలో తప్పనిసరిగా పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించాలని శుభ్రం చేసిన అనంతరం చెత్తను డంపింగ్‌ యార్డ్‌లకు తరలించాలని, మోరీలు శుభ్రం చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలలో అవసరమైన కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని, వైకుంఠ ధామాలు లేని గ్రామాలలో వెంటనే స్థలాలు గుర్తించి వాటి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామ సభలలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా, గ్రీనరీగా కనిపించడానికి లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ట్రీ గార్డ్‌లు ఏర్పాటు చేసుకోవాలని, పిచ్చి మొక్కలను, శిధిలావస్థలో ఉన్న ఇళ్లను తొలగించాలని ఆదేశించారు. పర్యటనలో మండల ప్రత్యేక అధికారులు ఏడి మైన్స్‌ సత్యనారాయణ, జిల్లా సంక్షేమ అధికారిణి స్రవంతి, తహసిల్దార్లు శ్రీధర్‌, అంజయ్య, ఎంపీడీవోలు నటరాజ్‌, రాములు నాయక్‌, ధర్పల్లి ఎంపీపీ అధ్యక్షురాలు సారిక తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *