Breaking News

గ్రామాల్లో పరిశుభ్రత స్పష్టంగా కనిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల గ్రామ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాలు పరిశుభ్రంగా కనిపించేలా పనులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఆయన మోర్తాడ్‌ మండల కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు.

ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూ, గ్రామాలు పారిశుద్ధ్య పరంగా, హరితంగా కనిపించడానికి ముఖ్యమంత్రి 30 రోజుల కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టారని, దీనిని పక్కాగా అమలు చేయడం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా కనిపించడంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుందన్నారు.

ఈ కార్యక్రమాల్లో మొక్కలు నాటడం, వీధులు శుభ్రం చేయడం, మోరీలు తీయడం, చెత్తను డంపింగ్‌ యార్డులకు, తరలించడం, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున మొక్కలు నాటి హరిత వనంగా గ్రామాలను తీర్చిదిద్దడం, గ్రామ సభల ద్వారా వార్షిక, పంచ వార్షిక ప్రణాళికలను రూపొందించుకోవడం, అందుబాటులో ఉన్న నిధులకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో గ్రామసభలో గుర్తించిన పనులను నిర్వహించడం తదితర కార్యక్రమాలను చేయాలన్నారు.

అధికారులు, సిబ్బంది, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, గ్రామ కమిటీల సభ్యులు, కో ఆప్షన్‌ సభ్యులు, అందరు కలిసి గ్రామాలను శుభ్రంగా తీర్చిదిద్దుకోవడానికి సమన్వయంతో పనిచేయాలన్నారు. చెత్తను తొలగించి ప్రజలు మళ్లీ వీధుల్లో వేయకుండా అవగాహన కల్పించాలని, అయినా వినకుంటే అవసరమైతే జరిమానాలు విధించాలని ఆయన పేర్కొన్నారు.

గ్రామాల్లో పిచ్చి మొక్కలను తొలగించడం, పాడుబడ్డ ఇండ్లను తొలగించడం, పాడుబడ్డ బావులను పూడ్చడం తదితర కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నారు. మొక్కలకు ట్రి గార్డులు ఏర్పాటుచేసి వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మోర్తాడ్‌ మండల కేంద్రంలో గ్రామ ప్రవేశం ముందు పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటు చేయాలని, బస్టాండ్‌ ఎదురుగా గల రోడ్డు వెంట బురద తొలగించాలని, గుంతలు పూడ్చాలని, ఎక్కడ కూడా నీరు నిలువకుండా, తద్వారా దోమల వ్యాపించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో మండల పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఎంపిడివో సద్గుణ, తహసిల్దార్‌ వెంకటేష్‌, సర్పంచ్‌ ధరణి, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *