Breaking News

సొంతింటి కల నిజం చేస్తాం

బాన్సువాడ, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ శివారులోని తాడ్కోల్‌ గ్రామం వద్ద రూ. 26.50 కోట్లతో అదనంగా నిర్మిస్తున్న 500 రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణానికి శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో దొంగలు, దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లు ఇళ్ళు పంచుకుని దోచుకున్నారని, నా ప్రాణం పోయినా, ఎంత ఒత్తిడి వచ్చినా లొంగను, అలా జరగనివ్వనని పేర్కొన్నారు.

అర్హులైన, నిజమైన లబ్ధిదారులకే కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా రెండు పడక గదుల ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 లక్షల ఇళ్ళ నిర్మాణానికి మంజూరు చేసిందని, ఇళ్ళ నిర్మాణాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉందన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలలో ఎక్కడ కూడా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం జరగడం లేదని పోచారం స్పష్టం చేశారు.

పేదవారైనా, ధనికులైనా ఆత్మగౌరవం ఒక్కటేనని, పేదవారి ఆత్మగౌరవం కాపాడటానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వసతులతో నూతనంగా ఇళ్లు నిర్మిస్తున్నారని చెప్పారు. పేదవారికి న్యాయం జరగాలని, అంచలంచలుగా అర్హులైన పేద వారందరికీ డబల్‌ బెడ్‌ రూం ఇళ్ళను నిర్మిస్తామని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో రూ. 300 కోట్లతో 5 వేల ఇళ్ళను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 3 వేల ఇళ్ళ నిర్మాణం పూర్తయిందని, మిగతా వాటి నిర్మాణం శరవేగంగా జరుగుతోందని స్పీకర్‌ అన్నారు.

ఇప్పుడు ముఖ్యమంత్రి బాన్సువాడ నియోజకవర్గానికి మరో వెయ్యి ఇళ్ళను మంజూరు చేశారని, ప్రస్తుతం ఇక్కడ మరో 500 ఇళ్ళ కోసం భూమి పూజ చేయడం జరిగిందన్నారు. ఇవే కాకుండా స్వంత స్థలం ఉండి తామే నిర్మించుకుంటామని ముందుకు వచ్చిన వారికి కూడా కేటాయిస్తామని, స్వంత ఇంటి కలను నిజం చేసి బాన్సువాడ పట్టణంలో ఇళ్ళు లేని పేదలు లేకుండా చూస్తామన్నారు. ఇళ్ళు కట్టడమే కాదు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, బాన్సువాడ పట్టణం బంగారు పట్టణంగా తయారవుతుందన్నారు.

మరో 10 వేల ఇళ్ళు మంజూరు చేయించి బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో ఇళ్ళు లేని వారందరి స్వంత ఇంటి కలను నిజం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ యన్‌. సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *