Breaking News

ఆరోగ్యకర సమాజం కోసమే 30 రోజుల ప్రణాళిక

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలందరికీ ఆరోగ్యకర వాతావరణం కల్పించడం, భావితరాలకు ఆరోగ్యకర సమాజాన్ని అందించడమే 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పారిశుద్ధ్యం, పచ్చదనం కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ అన్నారు. మంగళవారం నాగిరెడ్డిపేట మండలం జప్తి జానకంపల్లి గ్రామంలో జరిగిన 30 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో పాల్గొని గ్రామంలోని వీధులను పరిశీలించారు.

చెరువు కట్ట వరకు నిర్వహించిన పారిశుద్ధ్య పనులను పరిశీలించి అభినందించారు. మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామపంచాయతీ పోటీతత్వంతో పనిచేసి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు పరచాలని అన్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనం పనులు నిర్వహించుకుంటే ఎలాంటి వ్యాధులు, అంటు రోగాలు రావని, ఆరోగ్య గ్రామాలుగా విలసిల్లుతాయని అన్నారు.

కొత్త పంచాయతీ రాజ్‌ యాక్ట్‌ ప్రకారం గ్రామాలలో డంపు సైట్‌, వైకుంఠధామం, నర్సరీ ఏర్పాటు తప్పనిసరని, అందుకోసం ప్రతి గ్రామంలో వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు 125 గ్రామాలలో 400 ఎకరాలు మంకీ ఫుడ్‌ కోర్ట్‌ల స్థల సేకరణ జరిగిందని, వాటిలో పండ్ల మొక్కలు పెంచడం జరుగుతుందని తెలిపారు.

ప్రతి ఇంటికి దోమలు రాకుండా ఉండేందుకు పది కష్ణ తులసి మొక్కలు, ప్రతి ఇంటికి కరివేపాకు, వేప, నాలుగు రకాల పళ్ళ మొక్కలు ఇవ్వడం జరుగుతుందని, రైతులకు పొలం గట్ల మీద వేప, చింత, టేకు మొక్కలు అందించడం జరుగుతుందని, గ్రామాలలో అంతర్గత రోడ్ల వెంబడి పెట్రోఫామ్‌, గుల్మరా తదితర చెట్లను పెంచడం జరుగుతుందని, వీటికి అవసరమైన మొక్కలను గ్రామపంచాయతీ నర్సరీలోనే పెంచడం జరుగుతుందని తెలిపారు.

విద్యుత్‌ వీక్‌ కార్యక్రమంలో గ్రామంలో శిధిలమైన విద్యుత్‌ స్తంభాలు తీసివేసి, కొత్త వాటిని స్థాపించడం జరుగుతుందని, కిందికి వేలాడే విద్యుత్‌ వైర్లు సరి చేయడం జరుగుతుందని తెలిపారు. 500 జనాభా దాటిన గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్రాలీ, టాంకర్‌ కలిపి ఇవ్వడం జరుగుతుందని, వీటి ద్వారా చెత్త తొలగించడం, మొక్కలకు నీరు పోయడం తదితర పనులకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్రామానికి కావాల్సిన వసతులపై సంవత్సరం, ఐదు సంవత్సరాల యాక్షన్‌ ప్లాన్‌ గ్రామ సభలో తీర్మానం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రతిభ కనబరిచిన ప్రతి మండలంలో మూడు గ్రామాలకు ప్రధమ, ద్వితీయ, తతీయ బహుమతి కింద లక్ష రూపాయలు బహుమతిగా వచ్చే గణతంత్ర దినోత్సవం రోజున అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ మాట్లాడుతూ, మంచి ఆలోచన చేయాలని, అందులో భాగంగానే భావితరాల కోసం మంచి పనులను ఇప్పటి నుంచే ప్రారంభించాలని, అందుకుగాను 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రజలందరూ భాగస్వాములై తమ తమ గ్రామాలను మంచిగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు.

కార్యక్రమంలో ఆర్డిఓ దేవేందర్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి నాగేంద్రయ్య, డివిజనల్‌ పంచాయతీ రాజశేఖర్‌, ఎంపిపి రాజుదాస్‌, ఎండిఓ శ్యామల, సర్పంచ్‌ సాయిలు, ఎంపిటిసి సుజాత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సదస్సుకు పిలిచారు… అవమాన పరిచారు…

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట మండల‌ కేంద్రంలో రైతు అవగాహన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *