Breaking News

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో వైద్య ఆరోగ్య పంచాయతీరాజ్‌ మున్సిపాలిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమలు ప్రబలడానికి ముఖ్య కారణమైన అపరిశుద్ధ పరిస్థితులు ఏర్పడకుండా కార్యక్రమాలను పక్కాగా నిర్వహించడం ద్వారా పరిశుభ్రతతో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. అన్ని గ్రామాల్లో మున్సిపాలిటీలలో, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి ఎక్కడ కూడా మురుగునీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని, ఇండ్లల్లో వాడిన కూలర్లు, గుంతలు, కొబ్బరి చిప్పలలో నీరు ఉండకుండా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మిషన్‌ మోడ్‌లో అందరి సమన్వయంతో నిర్వహించాలని, ప్రతి శాఖకు కార్యక్రమంలో భాగస్వామ్యం ఉండాలని, అందరూ పాలు పంచుకోవాలని ఆయన ఆదేశించారు. ఎంపీడీవోలు, పంచాయతీ శాఖ అధికారులు, గ్రామ కార్యదర్శులు, మండల ప్రత్యేక అధికారులు ఈ విషయమై ప్రత్యేక కార్యాచరణతో విధులు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.

నిజామాబాద్‌ ఖలీల్‌వాడిలో ఎక్కువగా ఆసుపత్రులు ఉన్నందున పలు ప్రాంతాల నుండి రోగులు జ్వరాలతో వచ్చే అవకాశమున్నందున ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ కనబరచాలని, ప్రతిరోజు యాంటీ లార్వా కార్యక్రమాలు నిర్వహించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు డాక్టర్లు అందుబాటులో ఉండి అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు.

డెంగ్యూ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని టైఫాయిడ్‌, మలేరియా లాంటి జ్వరాలకు కూడా ప్లేట్‌ లెట్స్‌ పడిపోతాయని ప్రజలు విషయాన్ని గమనించాలని ప్లేట్లెట్స్‌ పడిపోయినంతనే డెంగ్యూ జ్వరాలు కావని డిఎం అండ్‌ హెచ్‌వో సుదర్శనం వివరించారు. సమావేశంలో డిఎం అండ్‌ హెచ్‌వో సుదర్శనం, డిసిహెచ్‌ఎస్‌ అన్నపూర్ణ, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌, జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ, మున్సిపల్‌ సాజిద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిమాండ్‌ ఉన్న పంటలు వేస్తే ఈజీగా అమ్ముకోవచ్చు…

ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ రైతు రాష్ట్రంలోని ఇతర ప్రాంత రైతుల‌కు ఆదర్శవంతంగా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *