అందరూ సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు పరిశుభ్రం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో అందరూ కలిసి సమన్వయంతో పని చేసినప్పుడు పరిశుభ్రంగా ఉంటాయని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. బుధవారం ఆయన నవీపేట మండల కేంద్రంలోను, ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోనూ పర్యటించి 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జరుగుతున్న పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా నవీపేట్‌లో అధికారులతో మాట్లాడుతూ నవీపేట ప్రధాన రహదారి నుండి బాసరకు వెళ్ళే దారిలో, గ్రామపంచాయతీ పాఠశాలలు, మార్కెట్‌ యార్డ్‌, ప్రభుత్వ కార్యాలయాలలో మరింత శుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి ఉందని ఆయన అధికారులకు సూచించారు. ఇందుకుగాను ప్రతి గ్రామంలో అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయవలసి ఉంటుందన్నారు.

రోడ్ల పక్కన దుకాణదారులు జీవనోపాధికి వ్యాపారాలు చేసుకుంటూనే పరిశుభ్రత పాటించాలని, రోడ్ల పక్కన చెత్త వేయవద్దని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రజలకు ఎక్కడ పడితే అక్కడ చెత్త వెయ్యకుండా అవగాహన కల్పించాలని, చెత్త తొలగించాలని, అయినా కూడా మళ్లీ చెత్త వేస్తే వారికి జరిమానా విధించాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రతి ఇంటికి దోమలు చేరకుండా తులసి, కష్ణ తులసి, రోజ్‌ మేరీ తదితర మొక్కలతో పాటు వేప, నిమ్మ తదితర మరో పది మొక్కలను కూడా అందించి వాటిని సంరక్షించేలా చూడాలన్నారు.

నవీపేటకు వచ్చే దారిలో అవెన్యూ ప్లాంటేషన్‌ కింద పెద్దగా అయ్యే మొక్కలను నాటించాలని ఆయన ఆదేశించారు. తప్పనిసరిగా 30 రోజుల కార్యాచరణకు అనుగుణంగా ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలో దానిని పక్కాగా అమలు చేయాలని లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంగడి బజార్లో బహిరంగ ప్రదేశంలో ప్రజలు పగటిపూట మద్యం సేవించడంపై అధికారులు, ఎక్సైజు, పోలీస్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే దీనిని తిరిగి జరగకుండా చర్యలు తీసుకోవాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. నవీపేట మండల కేంద్రంలో కొద్దిరోజుల్లోనే మరింత మార్పు కనిపించేలా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జానకంపేట గ్రామంలో బాసర వెళ్లే చౌరస్తా వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు అధ్వానంగా ఉండడంపై సంబంధిత అధికారులపై అసంతప్తి వ్యక్తం చేశారు.

వెంటనే ప్రధాన రోడ్డుకు ఇరువైపులా పరిశుభ్రత కనిపించేలా శుభ్రం చేయాలని ఎక్కడ కూడా బురద, అపరిశుభ్రత కనిపించకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి పదిహేను మొక్కలను సరఫరా చేసి, నాటించి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో నవీపేట తహసిల్దార్‌ మోతిసింగ్‌, ఎంపీడీవో సాజిద్‌ అలి, ఎడపల్లి మండల ప్రత్యేక అధికారి నర్సింగ్‌ దాస్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఇటుక బట్టీ కార్మికుల‌ను స్వస్థలాల‌కు తరలించారు…

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సందర్భంగా జిల్లాలో చిక్కుకుపోయిన 319 మంది ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *