Breaking News

మార్కెట్‌ యార్డును తరలిస్తే ఉద్యమమే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డెయిలీ మార్కెట్‌ యార్డులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడు రోజులుగా డెయిలీ మార్కెట్‌ను రైతుబజార్‌కు తరలించాలని మున్సిపల్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారని, మార్కెట్‌ను ఎందుకు తరలిస్తున్నారన్న విషయాన్ని అధికారులు చెప్పడం లేదని మండిపడ్డారు.

కొత్త జిల్లా అయినందున ప్రజల అవసరాలకు తగినట్టుగా మార్కెట్‌ను విస్తరిస్తే తప్పులేదని, కానీ రైతుబజార్‌లో మార్కెట్‌ పర్మనెంటుగా ఉంటుందా లేదా అనేది చెప్పడం లేదు ఎందుకని ప్రశ్నించారు. కొత్తగా నిర్మించిన రైతుబజార్‌లో కేవలం 85 మందికి మాత్రమే కూరగాయలు విక్రయించుకునే అవకాశము ఉందని, తైబజార్‌ వాళ్ళు ప్రతి రోజు 1100 మంది రైతులకు రసీదులు ఇస్తారన్నారు. మరి మిగతా వారిని ఎక్కడ కూర్చోబెడతారని రమణారెడ్డి ప్రశ్నించారు.

ట్రాఫిక్‌ సమస్య పేరుతో మార్కెట్‌ను తరలించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. రైతులంతా రోడ్డుపై కూరగాయలు విక్రయించమని అసిస్టెంట్‌ కలెక్టర్‌కు రాతపూర్వకంగా తెలియజేశారు. పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేయకుండా ట్రాఫిక్‌ సమస్య అని చెప్పి మార్కెట్‌ను తరలించే ఏర్పాట్లు చేయడం సరికాదన్నారు. మున్సిపల్‌ పరిధిలో చాలా ఓపెన్‌ స్థలాలు ఉన్నాయని, వాటిని పార్కింగ్‌ కోసం ముందు కేటాయించండన్నారు.

రైతుబజార్‌ ప్రాంతంలో మార్కెట్‌ యార్డు ఉందని, దసరా తర్వాత రైతులకు పంట చేతికి వచ్చి అమ్ముకోవడానికి మార్కెట్‌ యార్డుకు వస్తారన్నారు. తేమ శాతం సరిగా ఉంటేనే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్తుండటంతో రైతులంతా మార్కెట్‌ యార్డులోనే ధాన్యాన్ని అరబోస్తారని, ప్రస్తుతం రైతులు కూరగాయలను మార్కెట్‌ యార్డులో ఉన్న ఓపెన్‌ స్థలంలో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.

ధాన్యం అమ్ముకోవడానికి వస్తే రైతుబజార్‌ను అక్కడే కొనసాగిస్తారా.. లేక అక్కడినుంచి తరలిస్తారా ముందు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతుబజార్లో వర్షం పడితే మోకాలి లోతు నీళ్లు చేరుతుందని, అలాంటి స్థలంలో రైతులు కూరగాయలు ఎలా అమ్ముకుంటారన్నారు. రైతులకు, బీట్‌ చేసుకునే వ్యాపారులకి సరిపడా వసతులు కల్పిస్తే పది నిమిషాల్లో ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్‌ అవుతారని, ప్రస్తుతం ఉన్న డెయిలీ మార్కెట్‌ను రైతుబజార్‌కు తరలించి ఈ స్థలాన్ని ఏం చేస్తారు కూడా అధికారులు చెప్పాలన్నారు.

ఇక్కడ ప్రతి రోజు 70 నుంచి 80 లక్షల రూపాయల వ్యాపారం సాగుతోందని, ఇక్కడ కూరగాయల వ్యాపారస్తులు మాత్రమే కాకుండా ఇతర వ్యాపారస్తులు కూడా మార్కెట్‌ పై ఆధారపడి బతుకుతున్నారన్నారు. రైతులను, వ్యాపారులను, రాజకీయ నాయకులను, కనీసం అధికార పార్టీ మాజీ కౌన్సిలర్లకు కూడా సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి మార్కెట్‌ను తరలించాలంటే ఎలా సాధ్యమవుతుందన్నారు.

ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకచోట నుంచి ఇంకో చోటుకి మార్చాలంటే ఇలాగే మారుస్తారా..ఇంకో కార్యాలయం చూడకుండా రోడ్లపై కుర్చీలు వేసుకుని పనులు చేస్తారా అని ప్రశ్నించారు. మీకో న్యాయం ప్రజలకు ఓ న్యాయమా? డెయిలీ మార్కెట్లో లక్షల రూపాయలు పెట్టి బయోగ్యాస్‌ ఏర్పాటు చేశారని, ఒక్క నెల మాత్రమే దానిని నడిపి పక్కన పడేసారని, మార్కెట్లో మూత్రశాలలు ఉన్నా మరో మూత్రశాల ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు వధా చేశారని మండిపడ్డారు.

మార్కెట్‌ ను తరలిస్తే బయోగ్యాస్‌ను ఏం చేస్తారని, ఇవన్నీ శనివారం జరిగిన సమావేశంలో చెప్పామన్నారు. ఒక్కసారి వీటన్నింటి గూర్చి ఆలోచించి కలెక్టర్‌ నిర్ణయం తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో మూడు వెజిటబుల్‌ మార్కెట్లు, మటన్‌ మార్కెట్ల, ఒక చేపల మార్కెట్‌, ఒక పండ్ల మార్కెట్‌ ఏర్పాటు చేయాలని, వీటికి సరిపడా స్థలం జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉందన్నారు. అలా కాకుండా మార్కెట్‌ పై ఆధారపడిన కుటుంబాలను రోడ్డు పాలు చేయడం సరికాదన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *