Breaking News

ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని, నిజామాబాద్‌ జిల్లా ఇరిగేషన్‌ పనులపై అధికారులతో సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఉద్ఘాటించారు. నిజామాబాద్‌ జిల్లా పెండింగ్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై, ఆన్‌ గోయింగ్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశాల మేరకు ఎర్రమంజిల్‌ ఆర్‌అండ్‌బి ఆఫీస్‌ లో సంబంధిత ఇరిగేషన్‌ అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, ఈఎన్సీ ఇరిగేషన్‌ మురళీధర్‌ రావు, గోదావరి బేసిన్‌ కమిషనర్‌ మధుసూదన్‌ రావు, ఐడిసి ఎండి లక్ష్మారెడ్డి, ఎస్‌ఈ ఇరిగేషన్‌ నిజామాబాద్‌ మురళిధర్‌ రెడ్డి, కాళేశ్వరం ఈఈ ఆత్మారం, ప్రాజెక్ట్‌ డివిజన్‌ ఈఈ మధుకర్‌ రెడ్డి, ఇరిగేషన్‌ ఈఈ రాధాకష్ణ, ఐడిసి ఈఈ నాగేశ్వర్‌ రావు, డీఈలు తదితరులు హాజరయ్యారు.

ఆర్మూర్‌ నియోజకవర్గంలోని కంఠం, చిక్లీ, మచ్చర్ల సుర్భిర్యాల్‌, ఫత్తేపూర్‌, బాల్కొండ నియోజకవర్గంలోని చిట్టాపూర్‌, బాలకొండ, శ్రీరాంపూర్‌ గ్రామాలకు ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి సాగునీరు అందించేందుకు లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు అధికారులు రూపొందించినటువంటి నమూనాపై అధికారులతో మంత్రి చర్చించారు.

ఇదివరకే గుత్ప ఆయకట్టు కింద అలాగే లిఫ్టుల కింద ఉన్నటువంటి ఆయకట్టుకు వంద శాతం నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. చౌట్పల్లి హన్మంత్‌ రెడ్డి లిఫ్టు పథకంలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి వాటిని సరిచేసి దాని కింద ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సాగునీరు అందివ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ నియోజకవర్గాలలోని ప్యాకేజ్‌ 21 పైప్‌ లైన్‌ పనులు త్వరితగతిన పూర్తి కావడానికి ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామాభివద్ధి కమిటీల సహకారంతో రైతులను ఒప్పించి పైప్‌ లైన్‌ లు వేయించాలని అధికారులకు సూచించారు.

జుక్కల్‌ నియోజకవర్గానికి సంబంధించి నాగమడుగు లిఫ్ట్‌ పథకం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రానున్నారు కాబట్టి చెక్‌ డ్యామ్‌ లొకేషన్‌, అప్రోచ్‌ కేనాల్‌ పొడవు విషయం, పంప్‌ హౌస్‌ లొకేషన్‌ త్వరితగతిన నిర్ణయించాలని అలాగే ప్రాజెక్ట్‌లో ఎంత వీలైతే అంత తక్కువ భూ సేకరణ అవసరం అయ్యేటట్లు డిజైన్‌ చేయాలని సూచించారు.

అన్ని అంశాలలో స్థానిక శాసన సభ్యులు జీవన్‌ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, హన్మంత్‌ షిండే సలహాలు సూచనలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *