Breaking News

సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ ఉద్యోగులు ఈ నెల 5 నుండి సమ్మెలో పాల్గొనబోతున్నందున ప్రజా రవాణాకు ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్‌ కుమార్‌ కలెక్టర్లను, అధికారులను కోరారు. శుక్రవారం హైదరాబాద్‌ నుండి డీజీపీ మహేందర్‌ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్లు, పోలీసు, రవాణా, ఆర్టీసీ అధికారులతో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్లడానికి నోటీసిచ్చినందున ఉద్యోగులతో చర్చలు కొనసాగుతున్నాయని ఒకవేళ సమ్మె అనివార్యమైతే ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు ఏర్పడకుండా పండుగలను దష్టిలో పెట్టుకొని ప్రజల అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.

సమ్మె సందర్భంగా ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడానికి తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని, ఇందుకు విద్యాసంస్థల బస్సులు నడపడానికి చర్యలు తీసుకోవడంతో పాటు ఆర్టీసీ ద్వారా అద్దెకు నడుపుతున్న బస్సులతో పాటు భారీ వాహన డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న ప్రైవేట్‌ డ్రైవర్ల వివరాలను కూడా తీసుకొని వారికి అందుబాటులో ఉండి వారు విధులకు హాజరయ్యేలా చూడాలన్నారు.

అంతేగాక సమ్మెలో పాల్గొనే సిబ్బందికి, బస్సులకు ఆటంకం కలిగించకుండా అవసరమైన బందోబస్తుతో పాటు డిపోల వద్ద 144 సెక్షన్‌ విధించాలన్నారు. హైదరాబాద్‌ పరిధిలో మెట్రో రైలు ద్వారా ప్రస్తుతం ఉన్న మూడు లక్షల ప్రయాణికుల కెపాసిటీని పెంచి ప్రజలను రవాణా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఏర్పాట్లపై వివరిస్తూ ఈ విషయమై ఇప్పటికే సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని, జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో 281 ఆర్టీసీ బస్సులు 126 నడుపుతున్నామని తెలిపారు. 150 మంది భారీ వాహన లైసెన్స్‌ కలిగిన డ్రైవర్ల జాబితాను సిద్ధంగా ఉంచుకున్నామని 712 విద్యాసంస్థల బస్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.

అవసరమైతే ప్రైవేట్‌ డ్రైవర్‌లను తీసుకుని అద్దె బస్సులతో లతోపాటు విద్యాసంస్థల బస్సులను నడపడానికి చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లా సరిహద్దుల చెక్‌ పోస్టుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామన్నారు. ప్రజా రవాణాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈ విషయమై ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో 9347116263 కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు పోలీసు కమిషనర్‌ శ్రీధర్‌ రెడ్డి, డిటిసి శివలింగయ్య, ఆర్టిసి ఆర్‌ఎం సాల్మన్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలియో ఆదివారం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *