Breaking News

అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతరిక్షంలో జరిగే విషయాలు అందుకై నిర్వహించే పరిశోధనల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. స్థానిక నిర్మల హదయ విద్యాసంస్థలో వరల్డ్‌ స్పేస్‌ వీక్‌ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ, వరల్డ్‌ స్పేస్‌ వీక్‌ సందర్భంగా ప్రదర్శన నిజామాబాద్‌లో నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

అంతరిక్షం పై అవగాహన కలిగి ఉండడం విద్యార్థులతోపాటు ప్రతి ఒక్కరికి అవసరమేనని అన్నారు. సైన్స్‌ అంటే కేవలం సైంటిస్ట్‌లకే సంబంధించింది కాదని శాస్త్ర సాంకేతిక రంగాలపై అందరికీ కూడా కనీస పరిజ్ఞానం అవసరమని తెలిపారు. విద్యార్థులు ఒక లక్ష్యంతో చదువుతూ అంతరిక్ష ప్రయోగాలు కూడా చేపట్టి సమస్యలను పరిష్కరించుకోవడానికి అవసరమైన పరిజ్ఞానం అలవర్చుకొని అందుకు అవసరమైన అన్వేషణను చేపట్టాలన్నారు.

లక్ష్యం స్థిరంగా ఉంటే ఎంత పెద్దదైనా సాధించవచ్చని ఎంతోమంది మేధావులు, పెద్దలు దీనిని నిరూపించారని తెలిపారు. అబ్దుల్‌ కలాం ఒక చిన్న వెనుకబడిన గ్రామం నుండి గొప్ప శాస్త్రవేత్తగా, దేశ రాష్ట్రపతిగా ఎదిగిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున పరిశీలించి అవసరమైన పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని తెలిపారు.

విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకొని మరిన్ని కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని వారిలో కూడా గొప్పవారుగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. వరల్డ్‌ స్పేస్‌ వీక్‌ కార్యక్రమం ప్రతి సంవత్సరం 4వ తేదీ నుండి 10 వ తేదీ వరకు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని 15 వేదికలలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో విద్యార్థులకు క్విజ్‌, డ్రాయింగ్‌, డిజైన్‌ చాలెంజ్‌, స్పీచ్‌ తదితర అంశాలపై పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో గెలుపొందిన వారికి ఆయా వేదికల ద్వారా అవార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. క్విజ్‌ కాంపిటీషన్లో గెలుపొందిన వారికి శ్రీహరికోటలో నిర్వహించే ఫైనల్‌ క్విజ్‌ కాంపిటీషన్‌కు అవకాశం కల్పిస్తారని అక్కడ ఉన్న అన్ని విషయాలను వారికి వివరిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకొని వారిలో సైన్సు, టెక్నాలజీ, పిఎస్‌ఎల్వి, జీఎస్‌ఎల్వీపై అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల ప్రిన్సిపాల్‌ ఫాతిమా, రఘురాం, అనిల్‌ కుమార్‌, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *