Breaking News

కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఆర్టీసీ సంస్థ రక్షణ కోసం, సంస్థను ప్రభుత్వం విలీనం చేసుకోవాలని, గత 30 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ అమలు చేయాలని కోరుతూ శుక్రవారం అర్ధరాత్రి నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కార్మికులను ఉద్దేశించి ఎంసిపిఐయూ జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడారు.

మున్సిపల్‌ కార్యాలయం ముందు అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆర్టీసీ ఉద్యోగ కార్మికులతో సమ్మెకు మద్దతుగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన సకల జనుల సమ్మెలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులను విస్మరించడమే కాకుండా సంస్థలో ఉన్న కార్మికుల యొక్క వేతన సవరణ చట్టం 2017 లో సవరణ చేయాల్సి ఉండగా గత 30 నెలలుగా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

అరకొర వేతనాలతో, పని భారంతో ఉద్యోగాలు చేస్తున్న కార్మికులకు వేతన సవరణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ సంస్థను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని తదితర సమస్యల పరిష్కారం కోసం కార్మికవర్గం చేపట్టిన సమ్మెకు ఏఐసీటీయు కార్మిక సంఘం ఎంసిపిఐయు పార్టీ కార్మికవర్గానికి పూర్తి మద్దతునిస్తుందన్నారు.

సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటంలో ప్రత్యక్ష భాగస్వామ్యం వహిస్తుందని తెలిపారు. సమ్మెకు కామారెడ్డి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న వీడి దాస్‌, బహుజన ఐక్యవేదిక జిల్లా కన్వీనర్‌ సిద్ధిరాములు సిఐటియు జిల్లా అధ్యక్షుడు నాగన్న, లంబాడి హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షుడు గణేష్‌ నాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి విఎల్‌ నరసింహారెడ్డి, దళిత ఉద్యోగుల సంఘం జిల్లా నేత రాజేష్‌, కామారెడ్డి కార్మికుల సొసైటీ అధ్యక్షుడు బాబా, ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు వెంకట్‌ గౌడ్‌, మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు, జాతీయ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *