Breaking News

పట్టణాల్లో సమగ్ర శానిటేషన్‌ ప్లాన్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీలో చేపట్టిన ప్రత్యేక ప్రణాళికలు స్ఫూర్తిగా తీసుకుని పెద్ద ఎత్తున పట్టణాలలో కూడా సమగ్ర శానిటేషన్‌ ప్లాన్‌ వారం రోజుల్లో తయారుచేసి నివేదికను ప్రభుత్వానికి పంపించాలని రాష్ట్ర మునిసిపల్‌ పరిపాలన, ఐటీ, భూగర్భ గనుల శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌తో కలిసి మంత్రి జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ సమగ్ర సానిటేషన్‌ ప్లాన్లులో ఇంటింటికి సేకరించిన చెత్తను ట్రాన్స్‌పోర్టు డంపింగ్‌ యార్డ్‌లో తడి పొడి చెత్తను వేరు చేసి కంపోజ్‌ ట్రీట్మెంట్‌ దశ వరకు అధ్యయనం చేసి వినూత్నంగా అమలు జరిగే విధంగా ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. వ్యాపార వాణిజ్య మార్కెట్‌ కాంప్లెక్స్‌ హోటల్స్‌ ఇంటింటికి సేకరించిన బయో వేస్ట్‌ క్లినిక్‌ మేనేజ్మెంట్‌ చేయాలని, పట్టణాల్లో మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లను నిర్మించాలని, పెట్రోల్‌ పంపు వాణిజ్య సముదాయాలు, వ్యాపారప్రాంతాల్లో మహిళలకు పురుషులకు వేర్వేరుగ ఎన్ని మరుగుదొడ్లు అవసరమో గుర్తించి నివేదిక తయారుచేసి సంబంధిత వ్యక్తులతో మాట్లాడి మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి మునిసిపాలిటీలు మానవ వ్యర్ధాల ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ నిర్వహణ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అందుకోసం ప్రభుత్వం నిధులను కూడా మంజూరు చేస్తామని అన్నారు. 35 మునిసిపాలిటీల్లో డంపింగ్‌ యాడ్‌ లేవని స్థల సేకరణ పూర్తిచేయాలని 59 మున్సిపాలిటీలలో కంపోస్ట్‌ చేసే యార్డులు లేవని, 62 మునిసిపాలిటీల్లో డ్రై రిసోర్స్‌ కలెక్షన్‌ సెంటర్‌ ఏర్పాట్లకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీలలో ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతించడానికి ప్రభుత్వం 251 ఉత్తర్వును జారీ చేసిందని, ఈ పక్రియ 90 రోజులలో పూర్తిచేయాలని ఆదేశించారు.

టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో విచ్చలవిడిగా అనుమతి లేకుండా గహాలను నిర్మించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సేకరించిన ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా వసూలైన నిధులతో అదే పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పనకు ఖర్చు చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. స్వచ్ఛ నగరంగా ఎదగాలంటే అవసరమైన యంత్రాల ఏర్పాటు పారిశుద్ధ్య కార్మికులను నియమించుకోవాలని, స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో నిర్దేశించిన విధంగా 10 వేల జనాభాకు 29 మంది సానిటేషన్‌ వర్కర్స్‌ ఉండాలని అదేవిధంగా 500 ఇళ్లకు స్వచ్ఛ ఆటో కమర్షియల్‌ ప్రాంతంలో 300 షాపులకు మినీ లారీ ఏర్పాటుచేయాలన్నారు.

మునిసిపాలిటి ఎల్‌ఆర్‌ఎస్‌ డిఎంటి నిధుల నుండి అవసరమైన వాహనాలను కొనుగోలు చేయాలని, రాష్ట్రంలో 23 లక్షల 60 వేల 569 గహాలు ఉన్నాయని, జిహెచ్‌ఎంసి మినహాయించి మొత్తం 4613 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. కొనుగోలు చేసిన వాహనాల్లో పొడి తడి వేరువేరుగా కంపార్ట్మెంట్‌ ఉనాలన్నారు. అవుట్సోర్సింగ్‌ మునిసిపాలిటీ పర్మనెంట్‌ పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫామ్‌ భద్రత పరికరాలు పంపిణీ చేయాలని, అంతేకాకుండా పిఎఫ్‌ ఈఎఫ్‌ తప్పనిసరిగా జమ చేయాలని, పనిచేసే కార్మికులకు ప్రభుత్వమే బీమా ప్రీమియంలు చెల్లించి బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.

అవుట్‌ సోర్స్‌ రెగ్యులర్‌ పారిశుద్ధ్య కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఆలోచించి వినూత్నంగా అమలు చేస్తే స్వాగతిస్తామని చెప్పారు. ప్రతి మున్సిపాలిటీలో మానవ వ్యర్ధాల శుద్దీకరణ ప్లాంట్‌ వచ్చే మార్చి 2020 వరకు పూర్తిచేయాలని, అందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. పట్టణాల్లో గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారుచేసి దానిలో భాగంగా నర్సరీ ఏర్పాటు బడ్జెట్లో 30 శాతం గ్రీన్‌ ప్లాన్‌ ఖర్చు చేయాల్సి ఉందని, వాటర్‌ ఆడిట్‌ చేపట్టాలని చెప్పారు.

కొత్త మున్సిపాల్టీలు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ప్రతి ఇంటికి డస్ట్‌ బీన్స్‌ అందజేయాలని, ఎల్‌ఈడి బల్బులను ఏర్పాటు చేయాలని, ఆదాయ మార్గాలు కోసం వినూత్న ఆలోచనలు చేయాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో బడ్జెట్‌ ప్రిపరేషన్‌ చేయాలని అర్బన్‌ కేంద్రంలో సుందర ఆహ్లాదకరంగా పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వచ్చేనాటికి 68 మున్సిపాలిటీలు నుండి 140కి పెంచడం జరిగిందని, 42.6 శాతం ప్రజలు పట్టణ ప్రాంతంలో రానున్న ఐదేళ్ల కాలంలో 50 శాతం పెరిగే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇప్పటి నుండే ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావుతో పాటు నగరపాలక కమిషనర్‌ జాన్‌ సంసన్‌, టౌన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి జితేందర్‌ రెడ్డి, పిడి మెప్మా రాములు, ఆర్మూర్‌, బోధన్‌ భీమ్‌గల్‌ కమిషనర్లు శైలజ, స్వామి, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిర్లక్ష్యం వద్దు, జాగ్రత్త వహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ అనేది కరోనా వైరస్‌ ద్వారా వ్యాపించే సాధారణమైన ...

Comment on the article