Breaking News

బజారున పడ్డ పంచాయతీ

నందిపేట్‌, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలో మొదటి సారిగా చెక్‌ పవర్‌ ఉప సర్పంచ్‌కు ఇవ్వడం వివాదస్పదం అవుతుంది. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ నువ్వా నేనా అంటూ వివాదాలకు దిగుతున్నారు. ఫలితంగా గ్రామ అభివద్ధికి నిధులు వాడకంలో జాప్యం జరిగి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ప్రభుత్వం నిధులు మంజూరు చేసి 30 రోజుల ప్రణాళిక అమలు చేసిన అన్ని గ్రామాలలో నిధుల విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. సర్పంచ్‌తో సమానంగా ఉప సర్పంచ్‌లు కూడ గ్రామ అభివద్ధిలో తమ పాత్ర ఉండాలని భావిస్తున్నారు. ఒకే రాజకీయ పార్టీల వారే సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఉన్నచోట్ల సజావుగా సాగుతున్నాయి. కానీ వేరు వేరు పార్టీలకు చెందిన వారు ఉన్న చోట్ల గొడవలు చోటు చేసుకొంటున్నాయి.

గతంలో సర్పంచ్‌కు, గ్రామ కార్యదర్శికి కలిపి చెక్‌ పవర్‌ ఉండేది. ఏ పనిచేయాలన్నా గ్రామ సభ తీర్మానం అనంతరం కావలసిన నిధులను ఖర్చు చేసేవారు. దీంతో ఎలాంటి వివాదం ఉండేది కాదు. కానీ తెలంగాణ నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం ప్రభుత్వం కొత్తగా ఉప సర్పంచ్‌కు చెక్‌ పవర్‌ ఇవ్వడంతో సర్పంచులకు తలనొప్పిగా మారింది. ఫలితంగా గ్రామాలలో అభివద్ధిపై రాజకీయ వివాదం కొనసాగుతోంది.

నందిపేటలో…

నందిపేట్‌ మండల కేంద్రంలో సర్పంచ్‌గా బిజెపికి చెందిన ఎస్‌జి వాణి, తిరుపతి గెలిచినప్పటికి అధిక మొత్తంలో వార్డు సభ్యులు టిఆర్‌ఎస్‌ పార్టీ వారు గెలవడంతో ఉప సర్పంచ్‌గా వాసరి రామచందర్‌ ఎన్నికయ్యారు. పార్టీలకతీతంగా సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఎన్నికలు జరిగినప్పటికీ ఇద్దరు వివిధ పార్టీలకు చెందిన వారు ఉండటంతో వారి మధ్య సయోధ్య కుదరడం లేదు. ఎన్నికైన కొత్తలో వార్డు సభ్యులు, సర్పంచ్‌ కలిసి గ్రామ అభివద్ధి కొరకు పార్టీలకతీతంగా పనిచేయడానికి ప్రయత్నం చేశారు.

కానీ చినుకు చినుకు గాలివానగా చిన్న చిన్న విషయాలు పెరుగుతు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం వరకు వచ్చేసింది. శుక్రవారం బిజెపి నాయకులైన ఎస్‌జి తిరుపతి గ్రామ సర్పంచ్‌ ఎస్‌జి వాణి, జెడ్‌పిటిసి టిసి ఎర్రం యమున బిజెపికి చెందిన ఎంపీటిసిలు కలిసి బస్టాండ్‌ ఎదురుగా గల ప్రధాన రోడ్డుపై బైఠాయించి అభివద్ధికి అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి, ఉప సర్పంచ్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించడంతో ఒక్కసారిగా సర్పంచ్‌ – ఉప సర్పంచ్‌ వ్యవహారం ప్రజల ముందుకు వచ్చింది.

నాలుగు గోడల మధ్యన గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరగాల్సిన గ్రామ పంచాయతీ వ్యవహారం కాస్తా బజారున పడ్డట్లయింది. గ్రామంలో గత 50 రోజులుగా మొరం రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని చెక్‌లపై ఉప సర్పంచ్‌ సంతకం పెట్టడం లేదని ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ విధంగా చేస్తున్నాడని విమర్శిస్తూ సర్పంచ్‌ వాణీ శుక్రవారం ప్లే కార్డులు ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు.

దీనికి కౌంటర్‌గా శనివారం ఉప సర్పంచ్‌, సహచర టిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వార్డ్‌ సభ్యులు, టిఆర్‌ఎస్‌ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించి బిజెపి నాయకులకు సర్పంచ్‌కు కౌంటర్‌ ఇచ్చారు. దీనికి సమాధానంగా బిజెపి నాయకులు ఆదివారం పత్రిక సమావేశం నిర్వహించి ప్రతివిమర్శ చేస్తూ మహిళా సర్పంచ్‌ అయినందున టిఆర్‌ఎస్‌ నాయకులు ఇబ్బందులు పెట్టడం న్యాయామా అని నందిపేట్‌ సర్పంచ్‌ ఎస్‌జి వాణి ప్రశ్నించారు.

గ్రామ ప్రజా ప్రతినిధులు గ్రామ అభివద్ధి కొరకు కషి చేస్తారా, విమర్శ ప్రతి విమర్శలతో కాలం వెళ్లదీస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామం ఎలా అభివద్ధి చెందుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పాలకవర్గంలోని గ్రామ సర్పంచ్‌-సర్పంచ్‌, వార్డ్‌ సభ్యులు కలిసి ఎమ్మెల్యే, ఎంపీ సహకారం తీసుకొని గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలి కానీ ఈవిదంగా పత్రిక సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరినొకరు బురద జల్లే కార్యక్రమాలను ఆపాలని ప్రజలు కోరుతున్నారు.

Check Also

మాస్కులు, శానిటీజర్లు అందజేసిన జనవిజ్ఞాన వేదిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ వారు 1000 ...

Comment on the article