కోర్టు కేసులు, ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ

నిజామాబాద్‌, నవంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా శాఖలకు సంబంధించి కోర్టు కేసుల వివరాలు ఎప్పటికప్పుడు అందించాలని, ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పలు విషయాలపై ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా శాఖలకు సంబంధించిన కోర్టు కేసుల వివరాలను దానికి సంబంధించిన పరిస్థితిని ఎప్పటికప్పుడు కలెక్టరేట్‌కు తెలియచేయాలని, పేరా వైజ్‌ వివరాలు ఆ కేసు హైకోర్టుకు సంబంధించినదా లేక జిల్లా, ఇతర కోర్టులకు సంబంధించినదా తెలుపాలని, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందచేయాలని, ఇది నిర్దిష్ట సమయంలో జరగాలని కేసు తదుపరి హియరింగ్‌ ఎప్పుడు ఉన్నదో తెలపాలని, లేదంటే కాంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్ట్‌ అవుతుందని తెలిపారు.

జిల్లా అధికారులు అన్ని విషయాలను కూడా ప్రత్యేక శ్రద్ధతో తీసుకోవాలన్నారు. కోర్టు కేసులతో పాటు కేంద్రప్రభుత్వం నుండి వచ్చే లేఖలు, రాష్ట్ర ప్రభుత్వ లేఖలు, మానవ హక్కుల కమిషన్‌, ఇతర కమిషన్లు ఆదేశాలను ప్రత్యేక విభాగంగా చూడాలని, వీటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి చొరవ చూపాలని ఆదేశించారు.

ప్రజావాణి ఫిర్యాదులకు సంబంధించి ఫిర్యాదు ఏ స్థాయిలో పరిష్కారం కావాలో ఆ స్థాయిలో, అంటే మండల, డివిజన్‌, జిల్లాస్థాయిలో పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని, చాలా ఫిర్యాదులు మండల స్థాయిలోనే పరిష్కరించవలసి ఉన్నప్పటికీ ఫిర్యాదులు జిల్లా స్థాయికి వస్తున్నాయని తెలిపారు. జిల్లా అధికారులు విషయంలో తమ దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.

పోలీస్‌, ఎంప్లాయిమెంట్‌, నిజామాబాద్‌ ఆర్డీవో, పెన్షన్స్‌, పౌరసరఫరాలు, పంచాయతీ, మున్సిపాలిటీలు, తదితర శాఖలకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధతో వీటిని వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాసంస్థలు, వసతి గహాలకు సంబంధించిన కొనసాగుతున్న పనులు భవనాల నిర్మాణాలు, ఇతర పనులకు సంబంధించి నివేదికలను శుక్రవారంలోగా అందించాలని ఆదేశించారు.

అదేవిధంగా ఇంజనీరింగ్‌ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్ని రకాల నిర్మాణాల వివరాలను సమర్పించాలని తెలిపారు. వాటితో పాటు విద్యాసంస్థల, ఇతర శాఖల ఆస్తుల వివరాలు, భవనాల నిర్మాణాలు, ప్రస్తుతం ఉపయోగిస్తున్నవి త్వరలో ఉపయోగంలోకి రానున్నవి, నిర్మాణాలు పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో, ఖాళీగా ఉన్న స్థలాల వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

ప్రభుత్వ శాఖల్లో కిందిస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఎక్కడ కూడా ప్రజల పనులు ఆలస్యం కాకుండా చూడాలని, అవినీతికి ఆస్కారం లేకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. ప్రజావాణిలో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఓ రమేష్‌, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామశివారులోని పసుపు వాగులో ప్రమాదవశాత్తు జారిపడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *