క్యాన్సర్‌ వ్యాధిని నయం చేయవచ్చు

నిజామాబాద్‌, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్యాన్సర్‌ వస్తే చనిపోతారనేది అపోహ మాత్రమేనని ప్రముఖ క్యాన్సర్‌ వ్యాధి నిపుణులు డాక్టర్‌ కె. ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. క్యాన్సర్‌ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. వైబ్రంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం ”జాతీయ క్యాన్సర్‌ అవగాహన దినోత్సవాన్ని నిజామాబాదు నగర శివారులోని విశ్వోదయ జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు.

కార్యక్రమానికి ప్రధాన వక్తగా డాక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి హాజరై మాట్లాడారు. క్యాన్సర్‌ వ్యాధిని ముందుగా గుర్తిస్తే వంద శాతం నయం చేసుకోవచ్చన్నారు. భారత దేశంలో ప్రజల మరణాలకు కారణమవుతున్న ప్రధానమైన ఐదు వ్యాదులలో క్యాన్సర్‌ ఒకటన్నారు. ఆహారపు అలవాట్లు, పొగాకు, మద్యపానం తదితర కారణాల వల్ల క్యాన్సర్‌ వస్తుందన్నారు. మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ గురించి ముందస్తు అవగాహన అవసరమన్నారు.

దీర్ఘకాలికంగా మానని గాయాలు, కణతి, 15 రోజులకు మించి తగ్గని దగ్గు, అజీర్థి, మలమూత్రాలలో రక్తం పడడం వంటి అనారోగ్య సమస్యలున్న వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని, ఇవి కాన్సర్‌ వ్యాధి లక్షణాలు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. క్యాన్సర్‌ కారకాలు, నివారణ కోసం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి విద్యార్థులకు డాక్టర్‌ ప్రశాంత్‌ రెడ్డి సవివరంగా అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం జిల్లా సమన్వయకర్త తక్కూరి హన్మాండ్లు, సలహాదారులు తిరునగరి శ్రీహరి, చింతల గంగాదాస్‌, విశ్వోదయ కళాశాల ప్రిన్సిపాల్‌ మోహన్‌ బాబు, డైరెక్టర్‌ కార్తిక్‌, ఇందూర్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి మేనేజర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామశివారులోని పసుపు వాగులో ప్రమాదవశాత్తు జారిపడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *