Breaking News

భూ పంచాయతీలతో రెవిన్యూ శాఖ బద్నామ్‌

నందిపేట్‌, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో భూ రికార్డులను పరిశీలించి అర్హులైన వారికి పట్టాలు పట్టాపాస్‌బుక్‌లు అందించడంలో రెవెన్యూ అధికారులు పకడ్బంధీగా పనిచేస్తున్నా ఏదో ఒక చోట రెవెన్యూ సిబ్బందిపై నానా రకాలుగా శారీరక, మానసికంగా దాడులు జరుగుతున్నాయని రెవిన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ దాడులను అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య రెవెన్యూశాఖను కలచివేసిందని అన్నారు. ఆమె హత్యను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన మూడు రోజుల నిరసన దీక్షలో భాగంగా గురువారం మండలం కేంద్రంలోని రెవిన్యూ కార్యాలయాన్ని మూసి ప్రభుత్వానికి నిరసన తెలిపారు.

రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన భూ ప్రక్షాళనలో భాగంగా భూ రికార్డులను సరిచేసి ఉన్న వారికి భూములను సరిచేసి రికార్డులను అందించామని ఎక్కడో చోట తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ రెవెన్యూ సిబ్బందిపై ఆరోపణలు, దాడులు జరిగాయని కానీ ఇటీవల విజయరెడ్డిపై హత్య మాత్రం అందరినీ ద్రిగ్భాంతికి గురి చేసిందన్నారు. రెవెన్యూ సిబ్బంది నేరం చేసినట్లు కేవలం రెవెన్యూశాఖనే లంచగొండిగా అధికార పార్టీ నాయకులూ పేర్కొనడం సబబు కాదన్నారు.

రెవెన్యూశాఖ అధికారులు భయాందోళనకు గురి కావాల్సి వస్తుందని, అందులో మహిళా అధికారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని ముఖ్యంగా తమశాఖ నుంచి భూ పంచాయతీలకు సంబంధించి మార్పులు చేసి వాటి స్థానంలో ఇతరశాఖ పనులను అప్పగించాలని అధికారులు కోరుతున్నారు. ప్రొటోకాల్‌ మొదలుకొని సంక్షేమ పథకాల వరకు వారే చేయాల్సి వస్తుందన్నారు.

మండలంలో పై అధికారులు, అధికార ఎమ్మెల్యే, మంత్రులు, జిల్లా పరిషద్‌ చైర్మన్‌, ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్‌లు పర్యటించిన వారి వెంట మండల మేజిస్ట్రేట్‌ హోదాలో వెళ్ళ వలసి వుంటుందని, అదే విధంగా సంక్షేమ కార్యక్రమాల ప్రారంభానికి ఎమ్మెల్యే, మంత్రులు వస్తే కార్యక్రమం నిర్ణయమైన రోజు నుండి కార్యక్రం సజావుగా పూర్తయ్యే వరకు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తుంటారన్నారు.

దీంతో తమ దినసరి కార్యాలయం పనులు పెండింగ్‌లో పడితే రాత్రి 10 గంటల వరకు కూడ పనులు చేస్తున్న సందర్భాలు వున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదేవింధంగా జిల్లా కేంద్రంలో జరిగే మీటింగ్‌లకు వెళ్ళినా, అనారోగ్యంతో సెలవు తీసుకున్నా పనులు పెండింగ్‌ లో పడుతున్నాయని, బతుకుమ్మ చీరలు, రంజాన్‌, క్రిస్మస్‌ బట్టల పంపిణి పూర్తీ బాధ్యత రెవిన్యూ శాఖకే వుందని, పంపిణి మెటీరియల్‌ సకాలంలో రాకున్నా , తక్కువ వచ్చినా మండల రెవిన్యూ అధికారుల తప్పిదం వలనే జరిగిందని, రాజకీయ పార్టీలు విమర్శిస్తూ ఉంటాయన్నారు.

ప్రతి రోజు ఇలాంటి సమస్యలతో సతమవుతూ భూ ప్రక్షాళన, పట్టా పాస్‌ బుక్‌ లకు సమయం కేటాయించడం కత్తిమీద సాములాగా మారిందన్నారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురి కాకుండా కాపాడాల్సిన రెవిన్యూ అధికారులకు రక్షణ లేకుంటే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినా నామ మాత్రపు చర్యలు తీసుకొని వదిలేస్తారు తప్ప తమ ప్రాణాలపై ఎందుకు తెచ్చుకొంటారని ప్రజలు అంటున్నారు.

ప్రభుత్వం స్పందించి రెవిన్యూ అధికారులకు పోలీస్‌ రక్షణ కల్పించి, ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా వుందన్నారు. లేకుంటే ఎవరు పడితే వారు చట్టాలను చేతిలోకి తీసుకొని వ్యవస్థను నాశనం పట్టిస్తారన్నారు.

Check Also

గర్భిణీల‌కు పోషకాహారం పంపిణీ చేసిన ఎంపిటిసి

నందిపేట్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నందిపేట మండలం షాపురు గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *