Breaking News

తహసీల్‌ కార్యాలయాల్లో సెక్యూరిటీ

నిజామాబాద్‌, నవంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తహసిల్దార్‌ కార్యాలయాలలో ఎటువంటి సంఘటనలకు తావు లేకుండా సెక్యూరిటీ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కషిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తహసిల్దార్లకు పలు విషయాలపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇటీవల జరిగిన సంఘటన ప్రతి ఒక్కరు ఖండించడంతో పాటు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపవలసిందేనన్నారు. ఈ విషయమై రెవెన్యూ కార్యాలయాల్లో అధికారులకు, సిబ్బందికి అవసరమైన రక్షణ ఏర్పాటు చేయటానికి సిసిఎల్‌ఎ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని మండల, డివిజన్‌ స్థాయిలో ఏ విధమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలో తెలిపారన్నారు.

తహసిల్దార్‌ కార్యాలయంలో రక్షణ పర్యవేక్షణకు పోలీస్‌ సిబ్బంది వచ్చినప్పుడు అవసరమైన వివరాలు అందించడానికి కనీసం డిప్యూటీ తహసిల్దార్‌ సాయి అధికారి అందుబాటులో ఉండేలా చూడాలని వారు వచ్చినప్పుడు సంతకాలు చేయడానికి ఒక రిజిస్టర్‌ ఉంచాలని సమస్యలుంటే తెలపాలన్నారు. క్రింది స్థాయి ఉద్యోగి నుండి తహసిల్దార్‌ వరకు పరిపాలనా యంత్రాంగం రక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు. సిబ్బంది భయపడనవసరం లేదన్నారు.

కార్యాలయాల్లో వచ్చే వారిపై చెకింగ్‌ ముఖ్యమని ముఖ్యంగా ప్రజావాణి సందర్భంగా సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండి వచ్చిన ప్రతి ఒక్కరిని చెకింగ్‌ చేయాలని వారి వద్ద నిషేధిత వస్తువులు లేకుండా తనిఖీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పనులు పోలీసు సిబ్బంది కానీ కార్యాలయ సిబ్బంది కానీ చూడాలన్నారు. ఇతర రోజుల్లో కూడా వచ్చే ప్రజల నుండి దరఖాస్తులు ఇబ్బందులను తెలుసుకోవడానికి ప్రతిరోజు కనీసం గంటకు తగ్గకుండా ఒక సమయాన్ని కేటాయించాలని తహసిల్దార్‌ అందుబాటులో లేని సమయంలో ఇతర అధికారులు ఉండి ప్రజల నుండి స్వీకరించాలన్నారు.

ప్రజల నుండి వచ్చే పిటిషన్లపైన కూడా రెగ్యులర్‌గా పర్యవేక్షణ చేయడంతోపాటు వాటిని ఆన్‌లైన్‌ మరియు మ్యానువల్‌గా నమోదు చేయాలని సమస్యల పరిష్కారానికి నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఒకవేళ మండల స్థాయిలో వాటికి పరిష్కారం కాని పరిస్థితిలో అందుకు సంబంధించిన కారణాల వివరాలను రాతపూర్వకంగా దరఖాస్తుదారులకు చేయాలని పేర్కొన్నారు.

ఎల్‌.ఆర్‌.యు.పి.కి సంబంధించి 95 శాతం పూర్తయిందని, కేవలం 5 శాతం వివిధ కారణాల వల్ల పరిష్కారం చేయలేని పరిస్థితిలో పెండింగ్‌ ఉన్నందున ప్రజలు మళ్ళీ మళ్ళీ వస్తుంటారని ఈ విషయం గ్రామసభల్లో ప్రజలకు, రైతులకు కారణాలతో పాల్గొనాలన్నారు. జారి చేయవలసిన ధ్రువపత్రాలను కూడా వీలైనంత త్వరగా జారీ చేయాలన్నారు.

ఏ స్థాయిలో కూడా అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి నిర్ణీత తేదీలోగా పేరా వారిగా సమాధానాలు సమర్పించాలని రికార్డ్స్‌ అందచేయాలని కౌంటర్‌ అఫిడవిట్‌ సమర్పించాలని కోర్టు ఉత్తర్వులను అమలు చేయటానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కోర్టు కేసుల కాంటెంప్ట్‌ కాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సెన్సెస్‌ పనులు ప్రారంభమయ్యాయని వివరాలు సరిగా నమోదు జరిగేలా చూడాలన్నారు.

అదేవిధంగా ఎలక్టోరల్‌ వెరిఫికేషన్‌ ప్రోగ్రాం వివరాలు పూర్తిగా నమోదు జరిగేలా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. నజరి నక్షకు సంబంధించి ప్రజల ఎపిక్‌ నెంబర్‌, డోర్‌ నెంబర్‌ నమోదయ్యేలా మిషన్‌మోడ్‌లో పనిచేయాలన్నారు. జిల్లాలో పుష్కలంగా వర్షాలు కురిసిన అంచనాకు మించి 7 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రాబోతుందని అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తెచ్చిన రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలన్నారు.

అదేవిధంగా పాస్‌ పుస్తకాలు లేకున్నా కూడా వ్యవసాయ రెవెన్యూ శాఖల అధికారులు జారీచేసిన ధ్రువపత్రాలకు అనుగుణంగా నిజమైన రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. మన జిల్లాలో పండించిన ధాన్యాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకు రాకుండా పకడ్బందీ తనిఖీలు నిర్వహించాలన్నారు.

ప్రోటోకాల్‌ విషయంలో ఫిర్యాదులు రాకుండా ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి ముందుకు వెళ్లాలని శిలాఫలకాలు, వేదికపైకి ఆహ్వానించడం, ఆహ్వాన పత్రికలు ముద్రించడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, తదితర నిబంధనలను పక్కాగా పాటించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, సివిల్‌ సప్లై అధికారులు అభిషేక్‌ సింగ్‌, పద్మజ, ఆర్‌డివోలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, తహసిల్దార్‌లు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మాజీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *