Breaking News

అసంఘటిత కార్మికులు పెన్షన్‌ పథకానికి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసంఘటిత కార్మికులు కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. శనివారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ధన్‌ మరియు జాతీయ పెన్షన్‌ పథకం యొక్క అవగాహన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల లాగా కార్మికులకు టెన్షన్‌ ఉండదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్మికులకు పెన్షన్‌ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇందుకై 18 సంవత్సరాలు దాటి 40 ఏళ్ల లోపు వయసు గలవారు, నెలసరి ఆదాయం 15 వేల రూపాయలు మించని వారు, ఇన్కమ్‌ టాక్స్‌లో లేనివారు ఈపీఎఫ్‌/ ఎన్‌పిఎస్‌ / ఇఎస్‌ఐసిలో సభ్యులు కాని వారు అర్హులని తెలిపారు.

ఇండ్లల్లో పని చేసేవారు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, హమాలీలు, ఇటుక బట్టీలలో పనిచేసేవారు, ఇళ్లల్లో చెత్త సేకరించే కార్మికులు, రిక్షా కార్మికులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు, తదితరులు నిబంధనలకు అనుగుణంగా ఆదాయం మించనివారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. సంవత్సరానికి కోటిన్నర టర్నోవర్‌ మించని చిరు వ్యాపారులు స్వయం ఉపాధి వ్యాపారస్తులు కూడా ఈ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

వయసును బట్టి కొంత మొత్తం ఈ కార్మికులు ఈ పెన్షన్‌ పథకానికి చెల్లించవలసి ఉంటుందని, ప్రభుత్వం మరికొంత చెల్లించి ఈ పెన్షన్‌ పథకాన్ని అమలు చేస్తుందని 60 సంవత్సరాలు పూర్తిచేసుకున్న కార్మికులకు ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్‌ అందించడం జరుగుతుందని తెలిపారు.

ఒకవేళ దురదష్టవశాత్తు కార్మికుడు చనిపోతే అతని భార్యకు ఫ్యామిలీ పెన్షన్‌ కింద సగం పెన్షన్‌ చెల్లిస్తారని వివరించారు. రిజిస్ట్రేషన్‌ కొరకు ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా నంబర్‌తో మీసేవ కేంద్రాల్లో లేదా కామన్‌ సర్వీస్‌ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని వారికి ఒక పక్కన కూడా రిజిస్ట్రేషన్‌ అనంతరం అందిస్తారని తెలిపారు. ఈ సదుపాయాన్ని అసంఘటిత కార్మికులందరూ సద్వినియోగం చేసుకొని 60 సంవత్సరాల తర్వాత పెన్షన్‌ సదుపాయం పొందాలని కలెక్టర్‌ కోరారు.

అవగాహన కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్‌ చతుర్వేది, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు, స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఎల్‌ఐసి చీఫ్‌ మేనేజర్‌ సోమరాజు, ఎంపీడీవో సంజీవ్‌, ఇతర ఎంపీడీవోలు, కార్మికులు, తదితరులు, పాల్గొన్నారు.

Check Also

పనుల‌ పురోగతి బాగుంది

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందల్వాయి, గన్నారంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ...

Comment on the article