Breaking News

రైతు సమస్యలపై విస్తృత స్థాయి సమావేశం

కామారెడ్డి, డిసెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రానికి చెందిన వివిధ మండలాల యువ రైతులు రైతుల సమస్యలపై విస్తతస్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ మండలాల నుండి రైతులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో రైతు సమస్యలపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. భూమి ఉన్నవారు రైతు అనే పదాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిజంగా వ్యవసాయం చేసేవారే రైతు అని ప్రభుత్వం గుర్తించి రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తీర్మానించారు.

అలాగే రైతులందరికీ సబ్సిడీ రూపంలో వచ్చే వ్యవసాయ పరికరాల సదుపాయాలు అందరికీ కల్పించాలని కోరారు. అదేవిధంగా రైతులకు రైతు రుణమాఫీని ఏకకాలంలో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పంటలకు మద్దతు ధర ప్రతి సంవత్సరం 20 శాతం పెంచాలని, ప్రభుత్వం నకిలీ విత్తనాలను పూర్తిగా నిషేధించి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందేలా కషి చేయాలని పేర్కొన్నారు.

రైతులను ప్రోత్సహించేలా వ్యవసాయంలో నూతన వంగడాలను అందిపుచ్చుకునేలా రైతు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని, రైతు పండించే ప్రతి గింజ కొనే వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రెండు రోజుల్లో డబ్బులు రైతులకు అందేలా చూడాలని, హమాలి చార్జీలు రైతులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించారు.

ఈ నెల 8వ తారీఖు లోపు మండలంలోని ప్రతి గ్రామానికి చేరుకొని రైతులను ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, డిసెంబర్‌ 9వ తారీఖున మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో రైతు సమస్యలపై వినతి పత్రం తహసీల్దార్‌కు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈనెల 12 నుండి 16 తేదీలలో జిల్లాస్థాయి విస్తతస్థాయి సమావేశం 200 మందితో నిర్వహించాలని, 23 తారీకున వెయ్యిమంది రైతులతో కలిసి భారీ ర్యాలీగా కలెక్టర్‌ ఆఫీస్‌కి వెళ్లి కలెక్టర్‌కి వినతి పత్రం ఇవ్వాల్సిందిగా తీర్మానించారు.

ఉద్యమాన్ని అన్ని జిల్లాలకు విస్తరింపజేసి చలో సెక్రటేరియట్‌ చేయాలని అన్నారు. కార్యక్రమంలో గోపిటీ సంజీరెడ్డి, తిరుపతి రెడ్డి, మహిపాల్‌ యాదవ్‌, రంజిత్‌, మనోహర్‌ రెడ్డి, శివ, ప్రశాంత్‌, నరేష్‌, రనిల్‌, సంతోష్‌, నవీన్‌, మహేందర్‌, శ్రీకాంత్‌, రాజు, ఇంద్రసేనారెడ్డి, వివిధ మండలాల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు.

Check Also

అంబులెన్సులో సుఖ ప్రసవం

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ, పల్లెగడ్డ తండాకి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *