Breaking News

ఆర్‌టిసి ఉద్యోగులతో సిఎం ప్రకటించిన నిర్ణయాలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నిర్ణయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి పలకాలని, అందరినీ ఉద్యోగులు అనే పిలవాలని, యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారని, అందరూ ఒకటేనని, ఒకటే కుటుంబం లాగా వ్యవహరించాలన్నారు.

ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబర్‌ నెల జీతాన్ని మంగళవారం (డిసెంబర్‌ 2న) చెల్లిస్తామన్నారు. ఉద్యోగులు సమ్మె చేసిన 55 రోజులకు కూడా వేతనం చెల్లిస్తామని, ఉద్యోగులు ఇంక్రిమెంట్‌ యధావిధిగా ఇస్తామన్నారు. సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలని, ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఎక్స్‌ గ్రేషియా చెల్లిస్తామన్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్‌లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయిస్తామని, ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత ఉంటుందని, సంపూర్ణ టికెట్‌ బాధ్యత ప్రయాణీకుడిపైనే ఉంటుందని, ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోమని పేర్కొన్నారు.

కలర్‌ బ్లైండ్‌ నెస్‌ ఉన్న వారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప, ఉద్యోగం నుంచి తొలగించవద్దని, మహిళా ఉద్యోగులకు నైట్‌ డ్యూటీలు వేయవద్దని, రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలని సిఎం చెప్పారు. ప్రతీ డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్‌ చేంజ్‌ రూమ్స్‌, లంచ్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలని, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ మంజూరు చేస్తామని కెసిఆర్‌ అన్నారు.

మహిళా ఉద్యోగుల ఖాకీ డ్రెస్‌ తొలగిస్తామని, వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్‌ వేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రస్సు వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫామ్‌ వేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తగు సూచనలు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్‌ ఎన్నికలు నిర్వహించేది లేదన్నారు.

ప్రతీ డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని, ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా ఆర్టీసీలో హెల్త్‌ సర్వీసులు అందించాలన్నారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రతీ డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని, మందుల కోసం బయటకు తిప్పవద్దన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు అందించాలని, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీ ఎంబర్స్‌ మెంటు సౌకర్యం వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. ఉద్యోగుల పిఎఫ్‌ బకాయిలను, సిసిఎస్‌కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తామని, డిపోల్లో కావాల్సిన స్పేర్‌ పార్ట్స్‌ను సంపూర్ణంగా అందుబాటులో ఉంచుతామన్నారు.

ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్‌ చేస్తామని, ఆర్టీసీ కార్మికుల గహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుందన్నారు. ఆర్టీసీలో పార్సిల్‌ సర్వీసులను ప్రారంభించాలన్నారు.

Check Also

‘తెలంగాణ రత్న’ పురస్కారానికి దరఖాస్తుల‌ ఆహ్వానం

హైదరాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 14వ ...

Comment on the article