Breaking News

బిసిల అభివృద్దికి పెద్దపీట

బాన్సువాడ, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ వెనుకబడిన తరగతుల (బిసి) సంక్షేమ కమిటీ సమావేశం మంగళవారం అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్‌లో జరిగింది. కమిటీ చైర్మన్‌ వై. అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.

పేదల కష్టాలు తెలిసిన సభ్యులతో కూడిన కమిటీ ఇది అని, గతంలో ప్రజాప్రతినిధులు అంటే కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే అగుపడపతారు అనే నానుడి ఉండేదని, కాని నేడు ప్రజల మద్య గ్రామాలలో తిరుగుతూ ప్రజా సమస్యలను తీర్చుతున్నారన్నారు. జనాభాలో 51 శాతంగా ఉన్న బిసీలకు వారి జనాభా ప్రకారం ప్రభుత్వ పథకాలను కేటాయించాల్సి ఉంటుందని, ఈ ఏడాది బిసీల అభివద్ది కోసం బడ్జెట్‌ లో రూ. 3,367 కోట్లు కేటాయించారన్నారు.

నిధులను బిసీల అభివద్ది కోసం ఖర్చు చేయాలని, తెలంగాణ ప్రభుత్వం బిసీల స్వయం ఉపాది కోసం బారీ ఎత్తున సబ్సీడీ అందిస్తుందన్నారు. రూ. 50,000 లు అయితే 100 శాతం గ్రాంట్‌గా అందించడం చరిత్రలో ఏనాడు లేదని, లక్ష అయితే 80 శాతం సబ్సిడీ అందుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో ఏ విదంగా అమలవుతున్నాయో తెలుసుకోవాలంటే ప్రతి సమావేశంలో పాల్గొనాలని, అదేవిదంగా గ్రామ స్థాయిలో లబ్ధిదారులకు పంపిణీ, అమలు తీరును తెలుసుకొని రిపోర్టులను రూపొందించి ప్రభుత్వానికి అందించాలన్నారు.

తద్వారా లోటుపాట్లను సవరించి పథకాలను మరింత పారదర్శకంగా నిర్వహించడానికి వీలవుతుందని, పథకాలను ప్రకటించడమే కాదు వాటి అమలు తీరు ముఖ్యమన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి రెండు బీసి గురుకులాలను ఏర్పాటు చేశారని, జనాభాకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రెసీడెన్షియల్‌ స్కూళ్ళను ఏర్పాటు చేస్తుందని, ఇది గొప్ప నిర్ణయమన్నారు.

రాష్ట్రంలో మొత్తం 1195 రెసిడెన్షియల్‌ స్కూళ్ళు ఉండగా 7.80 లక్షల మంది విద్యార్ధులు చదువుకుంటున్నారని, పార్టీలకు అతీతంగా ప్రతి నియోజకవర్గానికి రెండు చొప్పున బిసీ రెసిడెన్షియల్‌ స్కూళ్ళను మంజూరు చేశారన్నారు.

రెసీడెన్షియల్‌ స్కూళ్ళ పనితీరును మెరుగుపరచడానికి అసెంబ్లీ కమిటీ స్వయంగా పరిశీలించి రిపోర్టును అందించాలన్నారు. కమిటీ సభ్యులు కాలే వెంకటేష్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌, ముఠా గోపాల్‌, పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, కోరుకంటి చందర్‌, ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, ఎగ్గే మల్లేష్‌ సమావేశంలో పాల్గొన్నారు.

Check Also

రెండు పడక గదుల ఇళ్ళ ప్రారంభం

బాన్సువాడ, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత గల లబ్ధిదారులందరికీ రెండు పడకల ఇల్లు మంజూరు ...

Comment on the article