Breaking News

దిశ లాంటి ఘటనలు జరగకుండా విస్తత అవగాహన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శంషాబాద్‌ ప్రాంతంలో జరిగిన దిశ హత్యోదంతం లాంటి సంఘటనలు జిల్లాలో జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు మహిళలకు రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సంబంధిత అధికారులను కోరారు. గురువారం తన ఛాంబర్‌లో పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయతో పాటు మహిళా ఉద్యోగినిలు అధికంగా పని చేసే శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దిశ లాంటి సంఘటన జరగడం దురదష్టకరమని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వపరంగా పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు మహిళలకు ఆపద వచ్చినప్పుడు తీసుకోవలసిన చర్యలతో పాటు స్వీయ రక్షణకు అవగాహన ఏర్పాటు చేయవలసి ఉన్నదని తెలిపారు.

మహిళలు అధికంగా పనిచేసే వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖతో పాటు 2.5 లక్షలకు పైగా సభ్యులు ఉన్న మహిళా సంఘాల గ్రూపుల సభ్యులకు కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆపదలో ఉన్నట్లు అనుమానం వచ్చినప్పుడు లేదా దారిలో భయం ఏర్పడినప్పుడు వెంటనే 100 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయాలని తద్వారా వీలైనంత త్వరగా వారికి పోలీసు రక్షణ లభించే అవకాశం ఉంటుందన్నారు.

దిశ సంఘటనతో 100 నెంబర్‌కు ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. పెట్రోల్‌ అయిపోయి బండి ఆగిపోతే కూడా పోలీసులు పెట్రోలు సహాయం అందించడానికి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. అంతేగాక సఖి సెంటర్‌ ద్వారా 24 గంటలు ఫిర్యాదులు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారన్నారు. ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదని అయితే ఆపత్కాలంలో స్వీయ రక్షణ గురించి కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మహిళలు ఎక్కువగా ఉన్న సంస్థల్లో అందరితో మంచి సంబంధాలు ఉన్న ఒక ఉద్యోగిని కానీ ఒక మహిళను కానీ ఆ శాఖ తరపున నోడల్‌ అధికారిగా నియమించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మరింత బందోబస్తు చర్యలు తీసుకోవడంతో పాటు గస్తీ పర్యవేక్షణ మరిన్ని సిసి టీవీల ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన వ్యక్తుల గురించి ఫోటోలు పేర్లు వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచాలని ఎక్కడ కూడా ప్రచురించవద్దని ఆయన ప్రతి ఒక్కరిని కోరారు.

సీపీ కార్తికేయ మాట్లాడుతూ అత్యవసరానికి ఆపద సమయంలో 100 నంబర్‌కు ఫోన్‌ చేయాలని తెలిపారు. మహిళల రక్షణ ఒక్క పోలీస్‌ శాఖదే అని భావించకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని వీలైనంత అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న షీ టీంల సహాయం కూడా పొందాలన్నారు. సంఘటనలు జరిగిన తర్వాత కాకుండా ఏమాత్రం అనుమానం కలిగినా, భయం ఏర్పడినా అప్రమత్తమై ముందే 100 కాల్‌ చేయాలని తెలిపారు.

ప్రతి నెలా జరిగే మహిళా సంఘాల సమావేశాలకు సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు సమాచారం అందిస్తే వారు అవసరమైన అవగాహన కల్పిస్తారన్నారు. గ్రామ పోలీసులు కూడా వారి పరిధిలోని గ్రామాలకు అధికారులుగా ఉన్నారని వారికి అన్ని విషయాలు తెలపాలన్నారు. కొన్ని హాట్‌స్పాట్‌, డార్క్‌ స్పాట్‌, అన్‌సేఫ్‌ ప్రాంతాలను గుర్తించడం చేస్తున్నామని అక్కడ అవసరమైన మరిన్ని రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.

అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని దానిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, హైవేల వద్ద వాహనాలను నిలపటం కూడా అంగీకరించమని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడ ఫిర్యాదు చేసినా పోలీస్‌ స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఫిర్యాదులకు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత పెట్రోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. మిస్సింగ్‌లు జరిగినప్పుడు కూడా వెంటనే ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.

సమావేశంలో అదనపు సీపీ శ్రీధర్‌ రెడ్డి అడిషనల్‌ డిసిపి ఉష విశ్వనాథ్‌, ఏసిపి శ్రీనివాస్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌, మెప్మా పిడి రాములు, డిఆర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌, డిడబ్ల్యువో ఝాన్సీ లక్ష్మి, అడిషనల్‌ డిఎం అండ్‌ హెచ్‌వో తుకారం, రాథోడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

లక్కీ లాటరీ నడుపుతున్న ఇద్దరిపై కేసు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్‌ ...

Comment on the article