Breaking News

పందులను నివారించ లేరా?

నందిపేట్‌, డిసెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలో ఏముంది ..ఒకవైపు అపరిశుభ్ర వాతావరణం.. మరోవైపు పందుల బెడద అంటూ ప్రజలు మాట్లాడుకొంటున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాల్సిన అధికారులు నిద్రమత్తులో జోగుతుండడంతో గ్రామం దుర్గంధంగా మారి కంపు కొడుతోంది.

ఏ వీధిలో చూసినా ఏమున్నది గర్వకారణం.. చెత్తాచెదారం- పందులు తప్ప అన్న విధంగా తయారైంది. పాలకులు, అధికారులు మేల్కొనకపోతే మున్ముందు చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు 30 రోజుల ప్రణాళికలో భాగంగా సెప్టెంబర్‌ నెలలో నందిపేట్‌ ఆకస్మిక తనిఖీ నిర్వహించి మండల అధికారిని హెచ్చరించారు. అయినప్పటికి పారిశుద్ధ్య పనులలో ఎలాంటి మార్పు రాలేదు. అదేవిధంగా నందిపేట్‌ గ్రామ పంచాయతి పరిధిలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి.

పందులు అధిక సంఖ్యలో ఉండడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. గ్రామం లోపల పందులను పెంచడం నిషేధించాలని గతంలో పెంపకం దారులకు నోటీసులిచ్చినా నేటికి కార్యరూపం దాల్చలేదు. కుళాయిల వద్ద, చేతిపంపుల వద్ద, ఇతర జలవనరుల వద్ద పందులు స్వైర విహారం చేస్తూ నీటిని కలుషితం చేస్తున్నాయి. నీటి మడుగుల్లో దోమలు వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

రోజురోజుకూ పందుల సంఖ్య పదులసంఖ్యలో పెరుగుతుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామంలోని బర్కత్‌ పుర, దుబ్బ తదితర కాలనీల్లో, ప్రధాన రహదారిపై కూడా పదుల సంఖ్యలో పందులు గుంపులుగా దర్శన మిస్తున్నాయి. గ్రామంలో ఇక్కడా- అక్కడా అని తేడాలేకుండా ఏరోడ్డులో చూసినా, ఏ గల్లీలో చూసినా పందుల మందలు స్వైర్య విహారం చేస్తున్నాయి. పందులతో గ్రామ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గల్లీల్లోని ఇండ్లలోకి చొరబడి అన్న పానీయాలు ద్వంసం చేస్తున్నాయి. గ్రామ మెన్‌ రోడ్‌ పక్కన పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాలకు తగిలించిన సంచులను చింపేసి అందులో ఉన్న వస్తువులను తినేస్తున్నాయి. గ్రామాల నుండి వచ్చే ప్రజలు ఒక దుకాణంలో వస్తువులు కొని వాహనానికి తగిలించి మరో దుకాణంలో ఇతర వస్తువులు కొనుగోలు కొరకు పోయి వచ్చే కొన్ని నిమిషాల వ్యవధిలోనే పందులు అట్టి సంచిపై పడి చిందర వందర చేసేస్తున్నాయి.

Check Also

గర్భిణీలు పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలి

నందిపేట్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా నందిపేట మండలం కోమటిపాలీ గ్రామంలో అంగన్‌వాడి ...

Comment on the article