అవినీతి అంతానికి కట్టుబడి ఉండాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవినీతికి తావులేకుండా పనులు చేయించుకోవడానికి ప్రజలు కషిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ నెల 3 నుండి 9 వరకు వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమాల ముగింపు రోజున సోమవారం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల్లో వస్తున్న చైతన్యం వల్ల కొంతమేరకు అవినీతి తగ్గిందని ఇది మరింత మెరుగు పడవలసిన అవసరముందన్నారు. ప్రజల్లో చైతన్యం ద్వారానే ఇది సాధ్యమవుతుందని సూచించారు. అధికారులకు విచక్షణ అధికారాలు ఉన్నందున అవినీతికి పాల్పడడానికి అవకాశాలుంటాయని తెలిపారు.

ప్రస్తుతం కొంత మేరకు ఈ విచక్షణ అధికారాలు కొంత తగ్గాయని దానితోపాటు సాంకేతికంగా కూడా మార్పులు రావడంతో చాలా వరకు ఆన్‌లైన్‌ ద్వారా సేవలు అందుతున్నాయని తెలిపారు. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రజలకు అధికారులతో పనులు అవసరమవుతాయని తెలిపారు. అందుకుగాను ముఖాముఖి సంప్రదింపుల ద్వారా కూడా అవినీతికి కొంత ఆస్కారం ఏర్పడుతుందన్నారు.

ప్రజలు కూడా వారి పనులు పొందడానికి విధి విధానాలకు కట్టుబడి ఉండాలని పనులు జరగడానికి తమ వంతు సమయం వచ్చే వరకు ఆగాలని నియమ నిబంధనలను అనుసరించి పనులు పొందడానికి ఇష్టపడాలని, తమ అర్హతల మేరకు పనులు పొందాలని, నియమ నిబంధనలను పాటించడానికి ఉండాలని, సరైన పద్ధతి ద్వారానే పనులు చేయించుకోవడానికి సంసిద్ధంగా ఉండాలని, తద్వారా అవినీతికి చాలావరకు చెక్‌ పెట్టడానికి వీలవుతుందన్నారు.

లంచం ఇవ్వబోమని, తాము తీసుకోబోమని ఇటు ప్రజలు, అటు అధికారులు ప్రతిజ్ఞ చేసి కంకణబద్ధులై ఉంటే అవినీతిని అరికట్టడం సాధ్యమేనన్నారు. అవినీతికి పాల్పడే వారి విషయంలో ఫిర్యాదు చేయడానికి 1064 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయాలని ఆయన కోరారు. విద్యార్థులు ఈ విషయంలో వారి తల్లిదండ్రులకు కూడా తెలియచేసి అవినీతిని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడి శిక్ష పడేలా చేసిన ఫిర్యాదు దారులకు బహుమతులు అందించారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలిచిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమాల్లో ఏసీబీ ఇన్స్‌పెక్టర్లు శంకర్‌ రెడ్డి, శివ కుమార్‌ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

స్థానిక ఎన్నికలు మరింత అప్రమత్తంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *