Breaking News

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఎన్నికల ఏర్పాట్లపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూలు విడుదలైన రోజు నుండి ఇప్పటివరకు అన్ని ముందస్తు చర్యలతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని తెలిపారు.

ఈ రెండు రోజులకు మరింత పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు జరగడానికి మరిన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా మరో పది ఎంసిసి టీమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని వచ్చే 48 గంటల్లో నిబంధనలు అతిక్రమణ జరగకుండా గట్టి పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి మున్సిపాలిటీల పరిధిలోని అన్ని మద్యం దుకాణాలను మూసి ఉంచడం జరుగుతుందని తెలిపారు.

ఇప్పటికే అనుమానిత 5.27 లక్షల రూపాయలను సీజ్‌ చేయడం జరిగిందని వివరించారు. పోలింగ్‌ రోజున అన్ని పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌ కాస్టింగ్‌ చేయించడం జరుగుతుందని, నిబంధనల అతిక్రమణకు పాల్పడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు గమనించాలని, అదేవిధంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాలని కూడా కోరారు.

అసెంబ్లీ, మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ స్టేషన్లు వేరువేరుగా ఉన్నందున ఓటర్ల సౌకర్యార్థం ఓటరు స్లిప్పులు పంపిణీ చేయడం జరుగుతుందని, దాని ఆధారంగా ఓటర్లు సులభంగా ఓటు వేయవచ్చని తెలిపారు. ఓటర్‌ గుర్తింపు కార్డు లేదా మరో 18 ఇతర గుర్తింపు కార్డులు ఏదైనా చూపించి ఓటర్ల జాబితాలో పేరు ఉంటే ఓటు వేయవచ్చని తెలిపారు. అర్హత గల ప్రతి ఓటరు కూడా ఓటింగ్‌లో పాల్గొని తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి ముందుకు రావాలని సూచించారు.

ఎవరైనా తమది కాకుండా దొంగ ఓటు వేయడానికి ప్రయత్నిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇందుకై అన్ని పోలింగ్‌ కేంద్రాలలో పకడ్బందీగా తనిఖీ చేయడానికి మహిళా అధికారులను కూడా నియమించడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్రాలలో ఓటర్లకు కనీస సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని హెల్ప్‌ డెస్క్‌ కూడా ఉంటుందని తెలిపారు.

జిల్లాలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇతర మూడు మున్సిపాలిటీలలో 146 వార్డులలో 621 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 4 లక్షల 36 వేల 887 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందుకుగాను 5 లక్షల 26 వేల బ్యాలెట్‌ పేపర్లు ముద్రిస్తున్నామని, 14 వేల పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లు కూడా ఉద్యోగులకు పంపిస్తామన్నారు. పోలీసు బందోబస్తులో భాగంగా 5 క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్లు, 126 హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ స్టేషన్లు, 162 సెన్సిటివ్‌ పోలింగ్‌ స్టేషన్లు, 328 నార్మల్‌ పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయని, మొత్తం 205 పోలింగ్‌ స్టేషన్‌ లొకేషన్‌లలో 621 పోలింగ్‌ స్టేషన్లకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు.

100 పోలింగ్‌ స్టేషన్‌ లొకేషన్లలో వెబ్‌ కాస్టింగ్‌ చేస్తున్నామన్నారు. 735 మంది చొప్పున ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, 2205 మంది ఇతర పోలింగ్‌ సిబ్బందిని, 107 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. 779 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని వివరించారు.

ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో శిక్షణ ఐపిఎస్‌ అధికారి కిరణ్‌, జిల్లా రెవిన్యూ అధికారి అంజయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సామ్సన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *