Breaking News

ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటింగులో పాల్గొనాలి

నిజామాబాద్‌, జనవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు కలిగిన ప్రతి ఒక్కరు మున్సిపల్‌ ఎన్నికలలో ఓటు వేయాలని, అదేవిధంగా ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఎన్నికలకు ఏర్పాటుచేసిన రిసెప్షన్‌ సెంటర్‌ను ఆయన మంగళవారం పరిశీలించారు. ఎన్నికల సిబ్బంది హాజర్‌కు సంబంధించి ఆర్‌డిఓను, మున్సిపల్‌ కమిషనర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, పకడ్బందీగా జరగడానికి యంత్రాంగం తరఫున నాలుగు మున్సిపాలిటీల పరిధిలో అన్ని ఏర్పాట్లు పక్కాగా చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ను నియమించడం జరిగిందని, అన్ని పోలింగ్‌ కేంద్రాలలో ప్రశాంతంగా, పకడ్బందీగా ఎన్నికలు జరగడానికి అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు.

డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో ఉద్యోగులు గందరగోళానికి గురికాకుండా ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక టేబుల్‌ ఏర్పాటు చేసి ఆ కేంద్రం యొక్క సిబ్బంది అందరూ ఒకే చోట కలుసుకునే విధంగా అక్కడికే వారికి పోలింగ్‌ మెటీరియల్‌ అందించే విధంగా ఏర్పాటు చేశామన్నారు. సిబ్బంది అందరూ కూడా ఇప్పటికే హాజరై వారి పోలింగ్‌ కేంద్రానికి సంబంధించి మెటీరియల్‌ స్వీకరించడం జరిగిందని తెలిపారు.

22వ తేదీ బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవుతుందని 5 గంటల వరకు కూడా కొనసాగిస్తామని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకొని తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి రావాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి లేదా దొంగ ఓట్లు వేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కచ్చితంగా చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు కూడా చేశామని, అభ్యర్థులు కానీ పార్టీలు కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించ వద్దని, ప్రవర్తనా నియమావళి అతిక్రమించకుండా చర్యలు తీసుకున్నామని, శాంతిభద్రతలకు ఎక్కడైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

జిల్లా యంత్రాంగం ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ట్రైనీ ఐపీఎస్‌ అధికారి కిరణ్‌, జిల్లా రెవిన్యూ అధికారి అంజయ్య, ఆర్డిఓ వెంకటయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సామ్సన్‌, ఇతరులు పాల్గొన్నారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *