జాహ్నవి అను నేను ….

కామారెడ్డి, జనవరి 27

కామారెడ్డి మునిసిపల్‌ చైర్మన్‌గా నిట్టు జాహ్నవి

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ చైర్మన్‌గా నిట్టు జాహ్నవి ఎంపికయ్యారు. 25 ఏళ్ల యువ రాజకీయ నాయకురాలిగా కామారెడ్డి రాజకీయ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మహిళ, కామారెడ్డి మునిసిపల్‌ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సష్టించారు.

ఇంతకీ ఎవరీ జాహ్నవి?

కామారెడ్డి రాజకీయ వేత్త, తెరాస పార్టీలో సీనియర్‌ నాయకుడు, మాజీ కౌన్సిలర్‌ నిట్టు వేణు గోపాల్‌ రావు కూతురు. ఎం.ఎ, బీఈడీ పూర్తి చేసి, లా కాలేజీలో చదువుతూ సివిల్‌ సర్వీసెస్‌ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నారు. ఈ తరుణంలో జీవితంలో అనుకోని కోణంలో రాజకీయంగా కెరీర్‌ మలుపు తిరిగింది. అత్యంత పిన్న వయస్సులో కామారెడ్డి చైర్మన్‌గా ఎన్నికవడం అనేది అసాధారణం.

కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే పట్టుదల జాహ్నవిది. చిన్నప్పటినుండి ఏపనైనా పట్టుదలతో, కార్య దీక్షతో, అనుకున్న సమయానికి పూర్తి చేయడం జాహ్నవి సహజ లక్షణమని ఆమె స్నేహితులు చెప్పారు. పరిపాలన విషయాలపై, గవర్నెన్స్‌, సమకాలీన జాతీయ, అంతర్జాతీయ విషయాలు తనకిష్టమైన విషయాలని, వీటిని అధ్యయనం చేయడం ఎప్పటికప్పుడు నోట్స్‌ చేసుకొని పెట్టుకోవడం జాహ్నవి దినచర్యలో భాగం.

మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై మొదటి సారి ప్రత్యక్ష ఎన్నికలలో విజయం సాధించడానికి ముందే ఛైర్‌పర్సన్‌గా ఎంపిక చేయడానికి అధికార పార్టీ నిర్వహించిన సర్వేలో ఫస్ట్‌ మార్కులు కొట్టేసింది. కామారెడ్డి లాంటి మునిసిపాలిటీ నిర్వహించడం ఆశామాషి కాదు. కానీ అన్ని రకాలుగా ఈ పదవికి తగిన వ్యక్తిగా ఎన్నో ఏళ్ళ తరువాత ఎంపికయ్యారని కామారెడ్డి యువతలో చర్చ మొదలైంది.

జాహ్నవి ఎంపిక అనేది యువతకు సరైన ప్రాధాన్యం కల్పించడమని, చదువుకొని, పరిపాలన విషయాలు క్షుణ్ణంగా తెలిసిన జాహ్నవి కామారెడ్డి మున్సిపల్‌ ముఖ చిత్రం మారబోతుందని, ముఖ్యంగా పారిశుధ్య సమస్యపై జాహ్నవి యుద్దం ప్రకటించడం ద్వారా తన మార్కు పరిపాలన ముద్ర వేయబోతుందని కామారెడ్డి పట్టణ వాసులు అభిప్రాయపడుతున్నారు.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *