Breaking News

పల్లె ప్రగతికి అత్యంత ప్రాముఖ్యం

నిజామాబాద్‌, జనవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుద్ధ్యం, పచ్చదనానికి అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమన్వయ సమావేశం వలన శాఖ అధికారుల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఉపయోగపడతాయని, అందుకని తప్పనిసరిగా జిల్లా అధికారులు సోమవారం ఉదయం ప్రజావాణికి, సాయంత్రం కన్వర్జెన్స్‌ సమావేశానికి హాజరు కావాలని తెలిపారు. తద్వారా వారం మధ్యలో వీలైనంత వరకు ఇబ్బంది పెట్టకుండా ఉంటుందని తెలిపారు.

అందువల్ల ఏ అధికారి కూడా తప్పనిసరి అయితే తప్ప సోమవారం గైర్హాజరు కావద్దని స్పష్టం చేశారు. ప్రజావాణి ప్రాముఖ్యాన్ని తగ్గించ వద్దని గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. అధికారులు చురుకుగా పని చేయాలని అప్పుడే శాఖాపరమైన పనులు సజావుగా పూర్తి చేయడానికి వీలవుతుందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారని ప్రతి రోజు కూడా ఈ విషయమై పలు సమాచారం అడుగుతున్నారని అందువల్ల అధికారులు ఈ కార్యక్రమంపై అత్యంత శ్రద్ధతో విధులు నిర్వహించాలన్నారు.

ఇందులో ముఖ్యంగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా డంపింగ్‌ యార్డులలో కంపోస్టు ఎరువును తయారు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం, ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలు అందించి 100 శాతం తడి పొడి చెత్త సేకరించడం, ప్రతి గ్రామానికి తప్పకుండా ట్రాక్టర్‌ సమకూర్చుకోవడం, దాని నెలసరి వాయిదాల చెల్లింపులు, మొక్కలకు నీరు అందించే కార్యక్రమం చేపట్టడం ద్వారా ఉపాధిహామీ నుండి నిధులు వస్తాయన్నారు.

స్మశాన వాటికలు ప్రతి గ్రామంలో వచ్చే నెల చివరి కల్లా పూర్తి చేయాలన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని ఇంకుడు గుంతలను నిర్మించుకునేలా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో నర్సరీల ఏర్పాటుతో పాటు అక్కడ మొక్కలు పెంచడానికి అవసరమైన చర్యలతో పాటు వాటికి ఫెన్సింగ్‌ ఎండాకాలంలో మొక్కలకు నీడ, నీరు ఏర్పాటు చేయాలన్నారు.

అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బి శాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కల పరిశీలన తదుపరి చర్యలపై వచ్చే నెల 5న తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. మండల ప్రత్యేక అధికారులు ఈ దిశగా పరిశీలన చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారిగా నియమించబడిన జిల్లాస్థాయి అధికారులు ప్రతి శుక్రవారం ఆయా గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రగతి కార్యక్రమాలపై నివేదికలు సిద్ధం చేసుకోవాలని, మండల అధికారులు ఆ మండలాల నుండే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలన్నారు.

ప్రతి శాఖ కార్యక్రమాలపై 15 రోజుల్లో ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 1న పలు జిల్లాల విశ్రాంత మాజీ సైనికుల ఉద్యోగులతో వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నందున దానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు సంబంధిత శాఖలు అందించాలని ఆదేశించారు.

సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డిఆర్‌ఓ అంజయ్య, సైనిక సంక్షేమ శాఖ మేజర్‌ గౌరవ్‌ జాదవ్‌, డిఆర్‌డిఓ రమేష్‌, డిపిఓ జయసుధ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *