ట్రాక్టర్లు కొనుగోలు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, పంచాయతీరాజ్‌ అధికారులు, మండలాల ఎంపీఓలతో పల్లె ప్రగతి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు సేకరించడం అత్యంత ప్రధానమైన విషయమని ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా ఉన్నారన్నారు. ప్రతి గ్రామపంచాయతీ తప్పనిసరిగా ట్రాక్టర్‌ ట్రైలర్‌ ట్యాంకర్‌ సమకూర్చుకోవాలని లేదంటే ప్రతినెలా ప్రభుత్వం నుండి విడుదలయ్యే నిధులను ఆపేస్తామని స్పష్టంగా తెలిపారు.

జనాభా 500 లోపు ఉన్న గ్రామానికి గ్రామ పంచాయతీలో కూడా ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలని, ఎక్కడైనా నిధుల సమస్య ఉంటే తాత్కాలికంగా సర్దుబాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకానీ ట్రాక్టర్‌ కొనుగోలు చేయడానికి ఇష్టపడని సర్పంచులకు నోటీసులు జారీ చేయాలని, దానికంటే ముందు వాయిదాల చెల్లింపునకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కూడా వారికి వివరించాలని అధికారులను ఆదేశించారు.

ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశమని, దీనిని అందరు కూడా అమలు చేయవలసిన బాధ్యత ఉన్నదని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం ప్రతి నెల 330 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్న విషయాన్ని అధికారులకు గుర్తు చేశారు. ట్రాక్టర్లకు నెలసరి వాయిదాలు చెల్లించడానికి ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 1500 మొక్కలు నాటితే ఉపాధి హామీ పథకం ద్వారా ట్రాక్టర్‌ ట్యాంకర్‌తో మొక్కలకు నీరు పోయడం, గ్రామపంచాయతీ పనులకు పంచాయతీ ట్రాక్టర్‌ను ఉపయోగించడం ద్వారా సులభంగా చెల్లించడానికి వీలవుతుందని తెలిపారు.

వచ్చే వారం లోగా ట్రాక్టర్‌ లేని అన్ని గ్రామ పంచాయతీలకు కొనుగోలుకు ఆర్డర్లు వేయాలని ఆదేశించారు. బ్యాంకు అధికారులు కూడా పెండింగ్‌ లేకుండా అన్ని ట్రాక్టర్లకు ప్రాధాన్యత క్రమంలో రుణాలు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా సంక్షేమ శాఖల ఎకనామిక్‌ సపోర్ట్‌ క్రింద మంజూరు పొందిన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసి గ్రౌండింగ్‌ జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ జయ సంతోష్‌, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, బ్యాంక్‌ అధికారులు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *