Breaking News

నిజామాబాద్‌కు మంచి ఇండస్ట్రియల్‌ పాలసీకి చర్యలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న రోజుల్లో నిజామాబాద్‌ జిల్లాకు ఒక మంచి ఇండస్ట్రియల్‌ పాలసీ కొరకు ఆలోచన చేయనున్నామని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక నిఖిల్‌ సాయి హోటల్‌లో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ డిస్కషన్‌ ఆన్‌ ప్రమోషన్‌ ఆప్‌ ఇండస్ట్రీస్‌ ఇన్‌ నిజామాబాద్‌ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ప్రముఖ వ్యాపార వేత్తలు పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తలు కలెక్టర్‌ను పలు సదుపాయాల కొరకు కోరారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వక్తలు తెలిపినట్లు మన రాష్ట్రంలో టీఎస్‌ ఐపాస్‌ విధానం చాలా బాగుందని జిల్లాలో వరి, పసుపు, ఎర్ర జొన్న, సోయాబీన్‌ తదితర పంటలు ఇతర జిల్లాల కంటే బాగా సాగవుతున్నాయని ఈ విషయంలో రైతులకు, వినియోగదారులకు ఏమైనా సమస్యలుంటే పరిష్కరించవలసిన అవసరముందన్నారు.

అదేవిధంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జిల్లాలో మంచి స్థాయిలో ఉన్నందున వాటికి వ్యాపారపరంగా లాభాలు చేకూర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించవలసి ఉన్నదన్నారు. త్వరలోనే సంబంధిత శాఖలతో సమావేశం ఏర్పాటు చేసి ఉభయకుశలోపరి సంతోషంగా ఉండే విధంగా సమస్యల పరిష్కారానికి అందరితో చర్చించి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. ఎకో సిస్టంకు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉన్నదని తెలిపారు.

అవసరమైతే రాష్ట్ర స్థాయి అధికారులను కూడా సమావేశానికి రావాలని కోరతామన్నారు. ముఖ్యంగా రైస్‌ మిల్లర్లు, పసుపు వ్యాపారులు రైతులతో తీసుకోవాల్సిన చర్యలపై ఇండస్ట్రీస్‌ పాలసీపై చర్చిస్తామని తెలిపారు. తప్పకుండా వ్యాపారులు బ్రతకాలి, పండించిన వారు బతకాలి, సొసైటీ కూడా బ్రతకాలనే ఆలోచనతో చర్యలు తీసుకుంటామన్నారు.

అయితే ఆయా వ్యాపారాలలో ఎవరైనా కల్తీ లేదా ఇతర అక్రమాలకు పాల్పడుతుంటే అదే వ్యాపారంలోని మిగతావారు దానిని సరిచేయడానికి చర్యలు తీసుకుంటే మిగతా వారికి చెడ్డ పేరు రాకుండా ఉంటుందని సూచించారు. సమావేశంలో సిఐఐ చైర్మన్‌ రాజు, కాకతీయ సాండ్‌ బాక్స్‌ ప్యాట్రన్‌ రవీష్‌, వ్యాంటేజ్‌ కన్సల్టింగ్‌ ఫౌండర్‌ మనుజ, తెలంగాణ సిఐఐ డైరెక్టర్‌ సుభజిత్‌ సాహా తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *