Breaking News

గేదెల కాపరుల‌ను మింగిన చెరువు

కామారెడ్డి, ఫిబ్రవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలం కొర్పల్‌ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గేదెల‌ను మేపే ఇద్దరు యువకులు వాటిని కడిగేందుకు నీటిగుంటలోకి దిగి, దురదృష్ట‌వశాత్తు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే…కొర్పల్‌ గ్రామానికి చెందిన యువకులు గుట్టమీది రాజు (16), ఎక్కనోల‌ దిలీప్‌ (12) గేదెల‌ను మేపుతుంటారు. కాగా ఎప్పటిలాగే గురువారం వీరిరువురూ గేదెల‌ను మేపేందుకు వెళ్లారు.

అదే సమయంలో గేదెలు నీటి గుంటలో దిగాయి. దీంతో దిలీప్‌, రాజు కూడా నీటి గుంటలోకి దిగి గేదెల‌ను కడుగుదామనుకున్నారు. ఈ క్రమంలో గేదెలు లోతు ఎక్కువున్న వైపు వెళ్లడంతో వాటిని అనుసరించిన వారు నీటిలో మునిగిపోయారు. యువకుల అరుపు విని స్థానికంగా పొలాల‌ దగ్గర ఉన్న రైతులు గుంట దగ్గరికి వెళ్లి చూసే సరికి వారు కనిపించలేదు. దీంతో రైతులు గుంటలోకి దిగి గాలించగా ఇద్దరి మృతదేహాలు ల‌భ్యమయ్యాయి. రైతులు యువకుల‌ కుటుంబాల‌కు జరిగిన ఘోరాన్ని వివరించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల‌ కుటుంబ సభ్యులు బోరున విల‌పించారు. ఇద్దరు యువకులు ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాదఛాయు అలుముకున్నాయి. కాగా మృతులిద్దరికీ ఈత రాదని తెలుస్తోంది.

Check Also

రైతుల‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు.

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న నియంత్రిత వ్యవసాయం గురించి తమకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *