Breaking News

ప్రజాప్రతినిధుల సహకారంతోనే ప్రగతి పనులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి గ్రామం, పట్టణం పరిశుభ్రంగా, ఆకుపచ్చగా మారాలంటే ప్రజాప్రతినిధుల‌ సహకారం అవసరమని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం సందర్భంగా భోజన విరామం అనంతరం ఆయన జడ్పీటీసీలు, ఎంపీపీల‌తో మాట్లాడుతూ, రాష్ట్రంలో పల్లె ప్రగతి వెల్లివిరియడానికి గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఆకుపచ్చగా కనిపించడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పని చేయవల‌సి ఉందని తెలిపారు.

రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, త్వరలో చేపట్టే పట్టణ ప్రగతికి గ్రామ, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, అదేవిధంగా పట్టణాల్లో కౌన్సిల‌ర్లు, కార్పొరేటర్లు వారి వంతు సహాయ సహకారాలు అందించినప్పుడే విజయవంతమవుతుందని తెలిపారు.

ఇందు కొరకు ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పంచాయతీ రాజ్‌ చట్టంతో పాటు త్వరలో పట్టణ చట్టాన్ని కూడా తీసుకురావడానికి చర్య‌లు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగా గురువారం శుక్రవారం అదనపు కలెక్టర్లకు, శుక్రవారం జిల్లా కలెక్టర్లకు ఎంసిఆర్‌. హెచ్‌ఆర్‌డి సంస్థలో శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. వచ్చే ఆరు నెల‌ల్లో గ్రామాలు, పట్టణాలు ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనుల‌పై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయని కోరారు.

ఇప్పటికే పల్లె ప్రగతి ద్వారా నిర్వహించిన కార్యక్రమాల‌ను విజయవంతంగా నిర్వహించడంతో ఏ గ్రామానికి వెళ్లినా మొక్కలు కనిపిస్తున్నాయని పరిశుభ్ర వాతావరణం ఏర్పడిరదని పేర్కొన్నారు.

ఎంపీపీలు, జెడ్‌పిటిసిలు ఈ దిశగా సర్పంచును, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధుల‌ను, అధికారుల‌ను కలుపుకొని అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డ్‌లు, స్మశాన వాటికలు, నర్సరీలు పూర్తి చేయించడంతోపాటు అన్ని గ్రామాల్లో ట్రాక్టర్లు సమకూర్చుకునే విధంగా అందుకు రుణా వాయిదాను మొక్కకు నీరు అందించడం ద్వారా ఉపాధి హామీ పథకం నిధుల‌తో చెల్లించడానికి వీల‌వుతుందని సర్పంచుకు ధైర్యం చెప్పాల‌ని కోరారు. భోజన విరామం తర్వాత విద్యాశాఖ, సంక్షేమ శాఖలు, ఆర్టీసీ తదితర శాఖల‌పై చర్చించారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *