Breaking News

యుద్ధంలో చివరి అంకంలో ఉన్నాం- ఈ కొద్ది రోజులు ఇదే దీక్షతో పని చేస్తే విజయం మన సొంతం – కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 30


నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ మహమ్మారిని మన దరిచేరనీయకుండా చేసిన యుద్ధంలో చాలా వరకు విజయం సాధించామని యుద్ధంలో గెల‌వడానికి చివరి అంకంలో ఉన్నామని ఈ కొద్ది రోజులు ఇదే దీక్ష పట్టుదల‌తో పని చేస్తే 100 శాతం విజయం మనదేనని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారుల‌కు ఉద్బోధించారు. 
సోమవారం ఉదయం క్యాంప్‌ కార్యాల‌యం నుండి కరోనా వైరస్‌ కట్టడికి పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగుల‌తో సెల్‌ కాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు. ఒకటి-రెండు పాజిటివ్‌ కేసులు మినహా జిల్లాలో లాక్‌ డౌన్‌, హోం క్వారంటైన్‌, పకడ్బందీగా కొనసాగుతుందని తద్వారా కొత్తగా అనుమానిత లేదా పాజిటివ్‌ కేసులు మన దగ్గర నమోదు కావడం లేదని తెలిపారు. 
ఇందుకు బయట దేశాలు, ఇతర రాష్ట్రాల‌ నుండి వచ్చిన వారిని రాష్ట్ర అధికారులు ఇచ్చిన జాబితాకు అదనంగా జిల్లాలో మిగతా వారిని కూడా గుర్తించి వారిని ఇండ్లలోనే వేరుగా ఉంచడానికి పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో ఇది సాధ్యమైందని ఇందుకుగాను మున్సిపల్‌ పరిధిలో కమిషనర్లు పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్థాయిలో గ్రామ కార్యదర్శులు, వీఆర్వోలు ఇతర కార్మికుల‌తో పాటు పోలీస్‌ కానిస్టేబుల్స్‌, ఎస్ ఐలు,  సిఐలు,  హోంగార్డులు ఇతర అధికారులు, వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యాధికారులు, పారామెడికల్‌ సిబ్బంది రెవెన్యూ శాఖలో తాహసిల్దార్‌లు, రెవెన్యూ అధికారులు ఇతర శాఖల‌ అధికారుల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమైందని కలెక్టర్‌ పేర్కొన్నారు. 
ప్రస్తుతం మనం కరోనా వైరస్‌పై పోరాడుతున్న యుద్ధం చిన్నదేమీ కాదని దేశ రక్షణకు సరిహద్దులో పని చేస్తున్న సిపాయిలు వారి ప్రాణాల‌ను కూడా లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తారని తెలిపారు. అయితే ఇప్పుడు చేస్తున్న యుద్ధంలో మన ప్రాణాల‌కు భయం లేనప్పటికీ ఇది కూడా దేశం కోసం చేస్తున్న ఒక యుద్ధం లాంటిదేనని కరోనా వైరస్‌ రావడం బాధాకరమని దీనిని నిర్మూలించవసిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని అందరం కలిసి ఏకతాటిపై నిలిచి దీనిని ప్రజల‌ నుండి దూరం చేద్దామన్నారు. 
అయితే మిగిలిన ఈ కొద్ది రోజులు కూడా అంతే ముఖ్యమైనవని, ఇండ్లల్లో ఏకాంతంగా ఉన్న ప్రజలు బయటకు రాకుండా చూడవల‌సిన బాధ్యత మనందరిపైనా ఉందని అదేవిధంగా లాక్‌ డౌన్‌ ఆదేశాలు పూర్తిగా అమల‌య్యే విధంగా, ప్రజలు సామాజిక దూరం పాటించే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాల‌ని ఆయన ఆదేశించారు. ఈ కొద్ది రోజులు ఇదే కార్యదీక్షతో నమ్మకం సడల‌నీయకుండా పని చేస్తే చివరికి విజయం మనదే అవుతుందని ఆయన తెలిపారు.

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article