Breaking News

మరికొద్ది రోజులు కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాను అరికట్టడానికి ప్రభుత్వాలు నిర్దేశించిన లాక్‌ డౌన్‌కు ప్రజలు పూర్తిగా సహకరించారని, కేంద్ర ప్రభుత్వ సూచనల‌ మేరకు పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో ప్రభుత్వం విధించే కంటేయిన్మెంట్‌కు కూడా కొద్ది రోజులు ప్రజలు ఇదే సహకారాన్ని అందించి మనమంతా క్షేమంగా ఉండడానికి తమ వంతుగా చేయూత అందించాల‌ని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి జిల్లా ప్రజల‌ను కోరారు.

జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు, తదనంతరం యంత్రాంగం తీసుకునే చర్యలు, ధాన్యం కొనుగోలు తదితర విషయాల‌పై ఆయన కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌ నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ, సంబంధిత అధికారుల‌తో సమీక్షించారు. అనంతరం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు. కరోనాను అరికట్టడానికి కలెక్టర్‌, సిపి, మున్సిపల్‌ కమిషనర్‌, డిఎం అండ్‌ హెచ్‌వో వారి సిబ్బంది ఎవరి స్థాయిలో వారు పూర్తిగా కరోనా కట్టడికి తమవంతుగా చిత్తశుద్ధితో పని చేస్తున్నారని, అదేవిధంగా మీడియా ప్రతినిధులు కూడా ఎంతో బాధ్యతతో ప్రజల‌కు అవగాహన కల్పిస్తున్నారన్నారు.

అయితే మనం చేస్తున్న యుద్ధం ఇంకా ఆగిపోలేదని మరో 20 రోజుల‌ వరకు ఇదే స్ఫూర్తితో పని చేయాల్సిన అవసరముందని, ఇందుకు ప్రజల‌ సహకారం స్వీయ నిర్భంధం పాటించవల‌సి ఉందని తద్వారా ఒకరినొకరు కాపాడుకోగలం అన్నారు. విదేశాల‌ నుండి వచ్చిన 3,800 మంది హోమ్‌ క్వారంటైన్‌లో ఉండి సహకరించడం వ‌ల్ల‌ ఎటువంటి ముప్పు రాలేదని తెలిపారు. అయితే ఇదే స్ఫూర్తిని ఢల్లీి మర్కజ్‌ నుండి వచ్చిన వారు కూడా ప్రభుత్వ అధికారుల‌ సూచనల‌ను పాటించి క్రమశిక్షణతో ఉన్నట్లయితే దీని నుండి బయట పడతామని తెలిపారు.

కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల‌లో 15 క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో నిజామాబాద్‌ 4, బోధన్‌ 4, రెంజల్‌ 1, మోస్రా 1, ఆర్మూర్‌ 1, బాల్కొండ 2, భీంగల్‌ 1, నందిపేట్‌ 1 ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతాల్లో పాజిటివ్‌ వచ్చిన ఇళ్లకు అరకిలోమీటరు నుండి కిలోమీటర్‌ వరకు నిబంధనలు వర్తింప చేస్తామని వివరించారు. ఈ క్లస్టర్లలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ప్రతి వంద కుటుంబాల‌కు వైద్య సిబ్బంది, మొబైల్‌ వాహనాల‌ ద్వారా కూరగాయలు కిరాణా సామాన్లు ఇళ్లకు దుకాణాల‌ ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు.

జిల్లాలో మంగళవారం మరో పది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఇప్పటి వరకు మొత్తం 39 కేసుల‌ని తెలిపారు. ఇందులో నిజామాబాద్‌ 22, బోధన్‌ 5, రెంజల్‌ 1, మోస్రా 4, మాక్లూర్‌ 2, నందిపేట్‌ 1, ఆర్మూర్‌ 1, బాల్కొండ 2, భీంగల్‌ 1 పాజిటివ్‌ కేసులు ఉన్నాయన్నారు. ఇంకా 109 రిపోర్టు పెండిరగ్‌లో ఉన్నాయని, వాటిలో ఎన్ని పాజిటివ్‌ వస్తుందో చెప్పలేమని అయినా జిల్లా యంత్రాంగం అన్నింటికీ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని వివరించారు.

పనిచేస్తున్న సిబ్బందికి అధికారుల‌కు బాధలు కల‌గకుండా ఇబ్బంది పెట్టకుండా ప్రజలు సహకరించాల‌ని ఆయన చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. రేషన్‌ కార్డుదారుల‌కు 70 శాతం బియ్యం పంపిణీ చేశామని, మరో 4 వేల‌ కార్డుల‌కు బియ్యం ఇవ్వవల‌సి ఉన్నదని, అది కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో రైతు తీసుకొచ్చిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం 547 కొనుగోలు కేంద్రాల‌ ద్వారా స్వీకరిస్తుందని, రైతు గాభరా చెందవల‌సిన అవసరం లేదన్నారు.

గన్ని బ్యాగుల‌ గురించి ముఖ్యమంత్రి పర్యవేక్షణ చేస్తున్నారని, ఇబ్బంది రాకుండా చూస్తారన్నారు. కొందరు పేదలు రేషన్‌ కార్డు గురించి దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం వారికి కార్డును జారీ చేస్తుందని అంతవరకు రేషన్‌ కార్డు ద్వారా తీసుకొని వాటిని ఉపయోగించని ప్రజలు కార్డు లేని పేదల‌కు ఆ బియ్యాన్ని అందించి ఆదుకోవాల‌ని మంత్రి కోరారు. తద్వారా మీ గ్రామ ప్రజల‌కు మీరు అన్నం పెట్టిన వారవుతారన్నారు.

మీడియా సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, ల‌త, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విఠల్‌రావు, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, డిఎం అండ్‌ హెచ్‌వో సుదర్శనం, ఏసిపి శ్రీనివాస్‌ కుమార్‌, ఆర్‌డిఓ వెంకటయ్య, డిఏఓ గోవింద్‌, డిసిఓ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్‌లో విస్తృతంగా పర్యటించిన అర్బన్‌ ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుని ఎమ్మెల్యే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *