Breaking News

కరోనా కట్టడి కోసం పనిచేస్తున్న‌ శాఖల సేవ‌లు వెల‌కట్టలేనివి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడి కోసం పనిచేస్తున్న శాఖల‌వారి సేవ‌లు వెల‌కట్టలేనివని రాష్ట్ర రోడ్లు మరియు భవనా ల శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. మంగళవారం వేల్పూర్‌ సొసైటీ దగ్గర బిల్డ‌ర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విపత్తు కాలంలో ప్రజల్ని కరోనా బారిన పడకుండా చేస్తున్న హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌, రెవెన్యూ, పోలీస్‌, అంగన్‌వాడి, మీడియా, ప్రజలు అంతా ఒక్కటై కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పనిచేస్తున్నదని తెలిపారు.

గత 27 రోజుల‌ నుంచి తెలంగాణ రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ పాటిస్తున్నామని, తద్వారా ఈ శాఖల‌ సిబ్బంది అధికారులు తమ కుటుంబాన్ని వదిలేసి కరోనా వైరస్‌ కట్టడి కోసం బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని, వారి సేలు వెల‌కట్టలేనివని అభినందించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో ఐదారు సార్లు పర్యటించినప్పుడు అందరూ కూడా ఎలాగైనా వ్యాధిని కట్టడి చేయాల‌న్న సంక‌ల్పంతో పని చేస్తున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి సీఎం గిఫ్ట్‌గా పారిశుద్ధ్య కార్మికుల‌కు, హెల్త్‌ సిబ్బందికి, డాక్టర్లకు, నర్సుల‌కు, పోలీసుల‌కు పది శాతం అదనపు వేతనం ప్రకటించడం జరిగిందని, ఈ శాఖలో కింది స్థాయిలో పని చేస్తూ సీఎం గిఫ్ట్‌ రాని వారిని ప్రోత్సహించడానికి ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించాల‌ని ఈ సందర్భంగా సభ్యులు తనను కలిసి నిధులు సేకరించి సహాయం చేస్తామని తెలిపారని వీరికి నిత్యావసర వస్తువులు అందించడానికి ముందుకొచ్చారని అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

నియోజకవర్గంలో నాలుగు శాఖల‌లో మొత్తం 1219 మందికి 10 కిలోల‌ బియ్యం, కిలో పెసరపప్పు, కిలో కంది పప్పు, కిలో నూనె, కిలో చక్కర, కిలో పిండి బిల్డ‌ర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు దాదాపు 11 ల‌క్షల‌ రూపాయల విలువగల‌ నిత్యవసర వస్తువులు ఇవ్వడం జరిగిందన్నారు. కరోనా వైరస్‌కు సంబంధించి చాలా మటుకు మనం కంట్రోల్‌లోకి వచ్చామని ఇదే స్ఫూర్తితో పని చేయాల‌ని, కరోనా బారి నుంచి బయట పడతామని, కొత్తగా కేసులు ప్రబల‌కుండా జాగ్రత్తలు తీసుకోవడం మన కర్తవ్యం అన్నారు.

డాక్టర్ల బృందం బాగా పనిచేస్తుందని, కష్ట కాలంలో మీరు ఏదైతే స్పూర్తి చూపిస్తు పని చేస్తున్నారో నిజంగా చాలా గొప్ప విషయని అభినందించారు. ఎవరికీ ఎన్ని అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ రాజకీయాలు పక్కనపెట్టి కష్టకాలంలో అందరం కలిసి పనిచేయడమే దాన్ని మానవత్వం అంటారని, ఇవాళ మన భారతదేశం సమాజం మానవత్వం చూపిస్తు పని చేస్తుందన్నారు.

అమెరికా, బ్రిటన్‌, ఇటలీ తదితర అగ్రదేశాల‌లో వేల‌ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని, మన దేశ ప్రధాని, మన ముఖ్యమంత్రి ముందు చూపుతో లాక్‌ డౌన్‌ విధించడం వ‌ల్ల‌ చాలా గొప్పగా మనం కరోనా వైరస్‌ నియంత్రించుకో గలుగుతున్నామన్నారు. అంతకుముందు వేల్పూర్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద ఎమ్మెల్సీ డి రాజేశ్వరరావుతో కలిసి 600 మంది క్రైస్తవుల‌కు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడానికి బయల్దేరే వాహనాల‌ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

కార్యక్రమాల‌లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్‌డివో శ్రీనివాస్‌, క్రిస్టియన్‌ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కే.ఆనంద్‌ పాల్‌, ఇతర సభ్యులు బిల్డ‌ర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు నరసింహారావు, ఎస్‌ఎన్‌ రెడ్డి, డివిఎన్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, సంతోష్‌ రెడ్డి, సురేందర్‌ రెడ్డి, ఎంపీపీ జమున, జెడ్పిటిసి భారతి తదితరులు పాల్గొన్నారు.

Check Also

పెద్దోల్ల గంగారెడ్డిని సన్మానించిన గల్ప్‌ బాధితులు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌లో యువజన సంఘాల ఆధ్వర్యంలో గల్ప్‌ బాధితుల సమావేశం ...

Comment on the article